Sanath Nagar: పూజలు చేస్తే డబ్బులు వస్తాయనుకున్నారు.. రావట్లేదని పూజారికే గన్ గురిపెట్టారు..

Sanath Nagar (tv5news.in)
Sanath Nagar: పూజలు చేస్తే డబ్బులు వస్తాయన్న ఆశతో ఓ ముఠా పూజా కార్యక్రమాలు తలపెట్టింది. ఎన్ని పూజలు చేసినా డబ్బులు రాకపోవడంతో.. చివరికి డబ్బుల కోసం పూజ చేసిన పూజారినే దోచుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠాను సనత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
భరత్‌నగర్‌కు చెందిన నాగేశ్వరరావు తన నివాసంలో పూజలు చేస్తే ధనవంతుడిని అవుతానని భావించి.. గుంటూరు జిల్లా దుర్గికి చెందిన పురుషోత్తం ఆచారి అనే పూజారిని హైదరాబాద్ రప్పించాడు. కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండ్రోజుల పాటు పూజలు చేయించుకున్నాడు. పూజలు పూర్తయినప్పటికీ తనకు డబ్బులు రాకపోవడంతో నాగేశ్వరరావు అతని అనుచరుడు రామారావు, పటేల్‌తో పాటు మరో ఐదుగురితో కలిసి పూజారిపై దాడి చేసి తుపాకులతో బెదిరించారు.
పూజల కోసం ఖర్చు చేసిన 3లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన పూజారి 45 వేలు రెండు విడతలుగా ఇచ్చారు. మిగిలిన డబ్బుల కోసం మళ్లీ బెదిరించారు. దీంతో పూజారి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు. అయితే.. పథకం ప్రకారమే పూజారిని రప్పించి దోపిడీకి పాల్పడ్డారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com