Mahesh Bank: ఏకంగా రూ.12.40 కోట్లను కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు.. పోలీసుల అదుపులో నిందితుడు..

Mahesh Bank: ఏకంగా రూ.12.40 కోట్లను కొట్టేసిన  సైబర్‌ నేరగాళ్లు.. పోలీసుల అదుపులో నిందితుడు..
Mahesh Bank: మహేష్ బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి సైబర్ కేటుగాళ్లు 12 కోట్ల 40 లకలు దోచుకోవడం సంచలనంగా మారింది.

Mahesh Bank: హైదరాబాద్‌లోని మహేష్ బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి సైబర్ కేటుగాళ్లు 12 కోట్ల 40 లకలు దోచుకోవడం సంచలనంగా మారింది. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు సైబర్ క్రైమ్‌ పోలీసులు. బ్యాంకు సొమ్ము దోపిడీ చేసేందుకు రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇందుకోసం ఇదే బ్యాంకులో మూడు కరెంటు అకౌంట్లు తెరిపించినట్లు చెబుతున్నారు.

ముంబైకి చెందిన మహిళల ద్వారా ఈ అకౌంట్లు తెరిపించారు సైబర్ నేరగాళ్లు. ఈ పనికి హుస్సెనీఆలంలోని ఓ వ్యాపారవేత్తను ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ సిద్దంబర్ బజార్, నాగోల్, హుస్సేనీ ఆలంలో.. ఈ కరెంట్ అకౌంట్లు ఉన్నాయి. ఎలాంటి అనుమానం రాకుండ సంస్థల పేర్లతో.. ఈ అకౌంట్లను తెరిపించారు సైబర్‌ నేరగాళ్లు.

డిసెంబర్‌ 23న నాగోల్‌లోని శాన్విక ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో, ఈ నెల 11న షానవాజ్‌ బేగం పేరుతో, హుస్సేనీ ఆలంలో హిందుస్తాన్‌ ట్రేడర్స్‌ పేరుతో మూడు అకౌంట్లు తీశారు. వీటి ద్వారానే బ్యాంకు ఆన్‌లైన్ వ్యవస్థలోకి చొరబడ్డారు. ఈ అకౌంట్లలో పరిమితిని 50 కోట్ల రూపాయలకు పెంచుకున్నారు. అనంతరం ఈ ఖాతాలకు రూ.12.4 కోట్లు మళ్లించుకున్నారు.

ఈ మూడు ఖాతాల నుంచే ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో ఉన్న 127 బ్యాంకు ఖాతాల్లోకి సైబర్ నేరగాళ్లు డబ్బు మళ్లించారు. ఇప్పటికే మళ్లించిన సొమ్మును చాలావరకు డ్రా చేసుకున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ముందుగా మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసి ఈ యూజర్, పాస్‌వర్డ్‌లను తమ చేతిలోకి తెచ్చుకుని.. దోచేశారు సైబర్ నేరగాళ్లు. గతంలో కోపరేటివ్ బ్యాంకు‌లో కూడా ఇదే తరహాలో డబ్బు కొట్టేశారు నైజీరియన్ కేటుగాళ్లు.

నేరగాళ్లు ప్రాక్సీ అకౌంట్ల ద్వారా హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. ఐపీలను గుర్తించే పనిలో ఉన్న సైబర్‌ క్రైం పోలీసులు.. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మహేష్ బ్యాంక్‌ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే హుస్సేని ఆలంకు చెందిన వినోద్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వినోద్‌.. కొంతకాలం క్రితం హిందుస్తాన్‌ ట్రేడర్స్‌ పేరుతో మహేష్‌ బ్యాంకులో అకౌంట్ తెరిచారు.

వినోద్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా డబ్బులు మళ్లించిన సైబర్ నేరగాళ్లు.. బ్యాంక్‌ సర్వర్‌లో ఆధారాలను తొలగించారు. సుమారు 18 గంటల పాటు బ్యాంక్ సర్వర్లను తమ ఆధీనంలోనే పెట్టుకున్నారు నేరగాళ్లు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తరువాత సైబర్ క్రిమినల్స్.. ఫోన్‌ నెంబర్లు, వివరాలను మాయం చేశారు.

Tags

Next Story