రూ.500 నోట్లు ఇస్తే రూ.2వేల నోట్లు ఇస్తామంటూ..
ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేశారు కాకినాడ పోలీసులు. తమ వద్ద 2వేల రూపాయల నోట్లు ఉన్నాయని, 500 రూపాయల నోట్లు ఇస్తే 90 లక్షలకు కోటి రూపాయలు ఇస్తామని నమ్మించారు.
ఇందుకోసం 2 వేల రూపాయల నోట్లు నిల్వ ఉన్న ఓ వీడియోను చూపించారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన నాగప్రసాద్‌ను ఫోన్‌లో విశాఖపట్నానికి చెందిన నలుగురు, కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన ఒకరు కలిపి మోసం చేసేందుకు యత్నించారు. ఒక వీడియోలో 2వేల రూపాయల నోట్లతో ఉన్న అట్టపెట్టెలు భారీగా ఉన్నట్టు చూపించారు. ఆ తరువాత ఫోన్ ద్వారా 2వేల రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, 500 రూపాయల నోట్లు కావాలని నమ్మించారు.
అయితే... అనుమానం వచ్చి నాగ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ కరెన్సీ ముఠా మోసం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలో దిగిన సర్పవరం పోలీసులు... ఐదుగురుని అదుపులో తీసుకున్నారు. ఇందులో విశాఖకు చెందిన భమిడిపాటి వెంకట సుధాకర్, రాజా రవిశేఖర్, నరసింగరావు, కొండబాబుతో పాటు కాకినాడ చెందిన సూర్య సుబ్రహ్మశర్మలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాస్తవానికి వీరి దగ్గర ఎలాంటి 2వేల నోట్ల నిల్వలు లేవని, కేవలం మోసం చేసి డబ్బు కాజేసే ప్రయత్నం చేశారని సీఐ గోవిందరాజులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com