Ankita Bhandari : దోషులను కఠినంగా శిక్షించాలని వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..

Ankita Bhandari : దోషులను కఠినంగా శిక్షించాలని వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..
Ankita Bhandari : ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన అంకిత మర్డర్‌ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి

Ankita Bhandari : ఉత్తరాఖండ్‌లో సంచలనం సృష్టించిన అంకిత మర్డర్‌ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, ప్రదర్శనలు చేస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు తక్షణమే మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. అంకిత పోస్ట్‌మార్టం రిపోర్టును బహిర్గతం చేయాలంటూ నిరసనలు చేపట్టారు.

మరోవైపు కాంగ్రెస్, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు మార్చురీ ముందు, అలాగే బద్రీనాథ్ హైవేపై ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో రోడ్డు బ్లాక్ అయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కోటేశ్వర్‌, కీర్తినగర్‌ నుంచి ట్రాఫిక్‌ మళ్లించారు. అయితే ఇక్కడ కూడా విద్యార్థులు రోడ్డును దిగ్బంధించారు. అంకిత హత్య కేసులో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తప్పుడు పనులను నిరాకరిస్తే హత్య చేస్తారా అంటూ మండిపడుతున్నారు.

అంకిత భండారి హత్య కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. రిసార్ట్‌కు వచ్చే గెస్ట్‌లతో సన్నిహితంగా ఉండటానికి ఒప్పుకోలేదనే అంకితనుబ్యారేజ్‌లోకి తోసి చంపేశారని పోలీసులు నిర్ధారించారు. బీజేపీ నేత వినోద్‌ ఆర్య కొడుకు పులకిత్‌ ఆర్యకు పౌరీ జిల్లా యమకేశ్వర్‌లో రిసార్ట్‌ ఉంది. అక్కడ రిసెప్షని‌స్టగా పనిచేస్తున్న అంకితను రిసార్ట్‌కు వచ్చే అతిథులతో గడిపేందుకు ఒప్పుకోవాలని పులకిత్‌ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అతనికి రిసార్ట్‌ మేనేజర్లు తోడయ్యారు. అలా చేయబోనని ఆమె ఎన్నిసార్లు స్పష్టం చేసినా వారు వేధింపులు ఆపలేదు.

అంకిత ఈ నెల 18 నుంచి కనిపించలేదు. ఆమె ఫోన్‌ పనిచేయలేదు. దాంతో ఆమె ఫ్రెండ్‌ ఒకరు పులకిత్‌కు ఫోన్‌ చేసి అడిగాడు. అంకిత తన రూమ్‌కు వెళ్లిపోయిందని చెప్పాడు. మరుసటి రోజు ఫోన్‌ చేస్తే అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు. రిసార్ట్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేస్తే జిమ్‌లో ఉందని చెప్పాడు. చివరకు ఆమె రిసార్ట్‌లో లేదన్న విషయం తేలింది. కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళనతో దర్యాప్తు ప్రారంభించారు. పులకిత్‌ను అరెస్ట్‌ చేసి విచారించగా చీలా కెనాల్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. హత్యకు గురైన విషయం తెలిసి స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. స్థానిక ఎమ్మెల్యే రేణు బిష్ట్‌ కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. రిసార్ట్‌ ప్రాంగణంలోని ఓ భవనానికి నిప్పు పెట్టారు.

బీజేపీ నేత వినోద్‌ను ఆ పార్టీ బహిష్కరించింది. ఆయన మరో కుమారుడు అంకిత్‌ను ఓబీసీ కమిషన్‌ ఉపాధ్యక్ష పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. స్థానిక పట్వారీని, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసింది. రిసార్ట్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ చెప్పారు. సీఎం ఆదేశాలతో రిసార్టును కూల్చివేశారు అధికారులు.

Tags

Next Story