Suryapet Medical College: వైద్య కళాశాలలో ర్యాగింగ్.. 30 మంది విద్యార్థులను గదిలో బంధించి..

Suryapet Medical College: అదో ప్రభుత్వ వైద్య కళాశాల. ర్యాగింగ్ భూతం నివురు గప్పిన నిప్పులా బయటికి రావడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. జూనియర్లపై పలువురు సీరియర్లు అరాచకానికి తెగబడ్డారు. ఈ ఘటన సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. జనవరి 1వ తేదీన ఆ విద్యార్థికి నరకం చూపించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటికి వచ్చింది.
సీనియర్ల నుంచి తప్పించుకొని ర్యాగింగ్ విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు బాధితుడు. దీంతో వారు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు విద్యార్థిని రక్షించారు. సీనియర్లు రమ్మన్నారంటూ తోటి జూనియర్ విద్యార్థి వచ్చి చెప్పడంతో.. వెళ్లానని బాధిత విద్యార్థి వెల్లడించాడు. ఒక గదిలో దాదాపు 25 నుంచి 30 మంది సీనియర్లు మద్యం, సిగరెట్‌లు తాగుతూ నరకం చూపించారని వాపోయాడు.
తనను టార్గెట్ చేసి బూతులు తిడుతూ రెండు గంటల పాటు మోకాళ్లపై ఉంచి చావబాదరని.. తలుపులు, కిటికీలు మూసేసి ట్రిమ్మర్‌తో జుట్టు తొలగించే ప్రయత్నం చేశారని తెలిపాడు. ఫోన్ రికార్డింగ్ చేస్తున్నానని గమనించిన సీనియర్లు మరింత రెచ్చిపోయారని.. ఫోన్ లాగేసుకున్నారని చెప్పాడు. వ్యక్తిగత విషయాలన్నీ ఆరా తీశారని.. ప్రతి ఒక్క సీనియర్‌కు సెల్యూట్ చేయిస్తూ చిత్రహింసలు పెట్టాడరని వాపోయాడు.
గతంలోనూ ఓ నాన్ లోకల్ విద్యార్థిపైనా ర్యాగింగ్ చేశారన్నారు బాధిత విద్యార్థి. ర్యాగింగ్ ఉదంతంపై జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ సీరియస్ అయ్యారు. వైద్య కళాశాలలో విచారణకు ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com