Railway Job cheating: రైల్వేలో ఉద్యోగం.. రూ.5 లక్షలిస్తే ఖాయం: ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

Railway Job cheating: చదివి రాస్తే పరీక్ష పాసవుతామేమో కాని, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి. ఆ మహానుబావుడేదో రూ.5 లక్షలిస్తే ఉద్యోగం గ్యారెంటీ అంటున్నాడు.. తలతాకట్టు పెట్టైనా రూ.5 లక్షలిస్తే ఉద్యోగం వస్తుంది. వచ్చాక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు అని నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు. అందుకే మోసగాళ్ల ఆటలు సాగుతున్నాయి. మోసపోయామని తెలుసుకున్న తరువాత చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని లక్షలు వసూలు చేసి నకిలీ పోస్టింగ్ ఉత్తర్వులతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు కొందరు మోసగాళ్లు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం మీడియాకు వెల్లడించారు.
బాగా చదువుకున్న వ్యక్తులే ఈ మోసాలకు పాల్పడేది. ఉత్తరప్రదేశ్‌కు సర్వేష్ సాహూ అలియాస్ అశోక్ కుమార్ సింగ్ ఎంబీఏ చదివాడు. విజయవాడకు చెందిన అబ్దుల్ మాజిద్ అలియాస్ శ్రీనివాస్ (26), మిశ్ర (దిల్లీ), దినేష్ (కోల్‌కతా) తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు.
రైల్వేలో టీసీ, ట్రాక్‌మెన్ తదితర ఉద్యగాలిప్పిస్తామంటూ ఫేస్‌బుక్, వాట్సప్ సోషల్ మీడియా వేదికల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆసక్తి కనబరిచిన వారికి వాట్సప్‌లో లింక్ పంపించాడు. అందులో వివరాలు నమోదు చేసుకున్నవారు ఢిల్లీలో వైద్య పరీక్షల నిమిత్తం అడ్వాన్స్‌గా రూ.50వేలు చెల్లించాలని కండిషన్ పెట్టాడు.
వైద్య పరీక్షల నిమిత్తం రూ.50 వేలు కట్టిన వారందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లి టెస్టులు చేయించారు. ఢిల్లీలో పనిచేయాలనుకుంటే పహాడ్‌గంజ్ డీఆర్ఎం కార్యాలయంలో మిశ్రాను, సౌత్‌లో పని చేయాలనుకుంటే ఖరగ్‌పూర్ డీఆర్ఎం కార్యాలయంలో దినేష్‌ను కలవాలని బాధితులకు చెప్పాడు. ఆ విధంగా కలిసిన వారందరికీ ఆఫర్ లెటర్ పంపించి మరో రూ.2 లక్షలు ఇస్తే ట్రైనింగ్‌కు పంపిస్తామని నమ్మించాడు.
డబ్బులు ఇచ్చిన అభ్యర్థులను బ్యాచ్‌లుగా విడగొట్టి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రాంతాల్లో రైల్వే ప్రాంతీయ శిక్షణ కేంద్రం పేరిట మూడు నెలల పాటు శిక్షణ ఇప్పించాడు. కొద్ది రోజుల తర్వాత రూ.3 లక్షలు తీసుకుని ఢిల్లీకి రావాలని వారికి సూచించాడు. అక్కడికి వచ్చిన వారందరి నుంచి డబ్బులు తీసుకుని ఐడీ కార్డు, కొన్ని నకిలీ పత్రాలను అందజేసి రెండు రోజుల తర్వాత ఢిల్లీలోని రైల్వే ప్రధాన కార్యాలయంలో సంప్రదించమని చెప్పాడు.
బాధితులు ఆఫర్ లెటర్లు తీసుకుని రైల్వే ప్రధాన కార్యాలయానికి వెళ్లడంతో మోసం బయటపడింది. ఈ ముఠాకు రూ.6.3 లక్షలు చెల్లించి మోసపోయానంటూ రాజేంద్ర నగర్ పోలీసులకు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బాధితులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
శంషాబాద్ పోలీసులు ప్రముఖ నగరాలు దిల్లీ, కోల్‌కతా, విజయవాడ నగరాలను గాలించి సర్వేష్ సాహు, అబ్దుల్ మాజీద్‌లను అరెస్ట్ చేశారు. మిశ్ర, దినేష్ పరారీలో ఉన్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ ముఠా నాలుగైదేళ్లుగా వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిందని, ఈ వ్యవహారంలో రైల్వే ఉద్యోగుల పాత్రపైన అనుమానం వస్తుందని అన్నారు. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com