Rajanna Sirisilla District: యువతి కిడ్నాప్ కలకలం.. ప్రేమించిన యువకుడిపైనే అనుమానం..

Rajanna Sirisilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. చందుర్తి మండలం మూడపల్లిలో ఓ యువతిని నలుగురు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా.. కారులో వచ్చిన నలుగురు యువకులు... అమెను బలంవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి తండ్రిని కొట్టారు. కిడ్నాప్ చేసే దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే జ్ఞానేశ్వర్ అనే యువకుడే తమ కూతుర్ని కిడ్నాప్ చేశాడని బాధితులు చెబుతున్నారు. తన కూతుర్ని జ్ఞానేశ్వర్... ప్రేమ పేరుతో వేధించేవాడని... ఇప్పుడు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అతనిపై కేసు పెట్టడం జరిగిందన్నారు. జ్ఞానేశ్వర్‌పై పోక్సో కేసు పెట్టి, అరెస్ట్ చేశారని... ఇటీవల జైలు నుంచి రిలీజ్ అయ్యాడని యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కూతురుపై కక్షతోనే కిడ్నాప్ చేసి ఉంటాడని అంటున్నారు.
పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. కారులో ఎక్కడికి తీసుకెళ్లారు..? ఎంత మంది కిడ్నాప్ చేశారనేది రాబడుతున్నారు. జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యువతిని సురక్షితంగా రక్షించేందుకు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా విడిపోయి.. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com