Telangana: తెలంగాణలో వరుస అత్యాచార ఘటనలు.. ఆలస్యంగా వెలుగులోకి మరో 3 అఘాయిత్యాలు..

Telangana: తెలంగాణలో వరుస అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమ్మాయిలు ఎంతవరకు సేఫ్‌గా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనంగా మారిన మైనర్‌పై గ్యాంగ్ రేప్ ఘటన మరవక ముందే.. మరో 3 అత్యాచార ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఓఘటనలో అనాథ మైనర్‌పై అత్యాచారం జరగ్గా.. మరో ఘటనలో మైనర్ బాలికను ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. అటు మరో ఘటనలో వివాహితపై ముగ్గురు యువకుల సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఈఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
సికింద్రాబాద్ కార్ఖానాలో బాలికపై ఐదుగురు రేప్ చేయడం సంచలనంగా మారింది. ఐదుగుర్లో ముగ్గరు మైనర్లే అని తేల్చారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికతో పరిచయం చేసుకున్న ధీరజ్, రితేష్ అనే వ్యక్తులు.. ఆమెను ఓరోజు హాటల్‌కు పిలిపించుకుని గ్యాంగ్ రేప్ చేశారు. అక్కడితో ఆగకుండా దాన్ని వీడియో తీసి బాలికను బెదిరించడం మొదలుపెట్టారు. 2నెలలుగా బాలికను బెదిరిస్తూ రేప్ చేస్తూనే ఉన్నారు. ఇక వీడియోలు అప్పగిస్తామని మళ్లీ హోటల్‌కు పిలిపించి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతురి పరిస్థితి తెలుసుకున్న తల్లిందడ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడంతో విషయం బయటపడింది.
దీంతో మే30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు ఐదుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక మరో ఘటనలో అనాథ మైనర్‌పై అత్యాచారం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్డులోనే ఈ దుర్ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమపేరుతో నమ్మించిన ఓ యువకుడు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు నింబోలి అడ్డా అనాథాశ్రమంలో ఉంటోంది. ఇంటర్ చదువుతున్న బాలికకు.. దగ్గర్లోనే జిరాక్స్ షాప్‌లో పనిచేస్తున్న నిందితుడు సురేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఫోన్ కొనిచ్చిన సురేష్.. తరచూ కాల్ మాట్లాడేవాడు.
ఏప్రిల్ 20న తాను ఫ్రెండ్స్ బర్త్‌డేకు నెక్లెస్ రోడ్‌కు వెళ్తున్నట్లు బాలిక సురేష్‌తో చెప్పింది. తాను వస్తానని చెప్పి అక్కడికి వెళ్లిన సురేష్.. అందరూ బిజీగా ఉన్న సమయంలో బాలికను మాట్లాడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. కారులోకి ఎక్కించి అత్యాచారం చేశాడు. విషయం ఇటీవలే అనాథశ్రమం నిర్వాహకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో నారాయణపేటలోని వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేయడమే గాక.. వాటిని చూపించి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. వీరి అరాచకాలు భరించలేకపోయిన బాధిత వివాహిత 3రోజుల కిందట పోలీసులను అశ్రయించింది. ఐతే బాధితురాలు ఫిర్యాదు చేసి 3రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లతోనే అరెస్ట్ చేయలేదనే ఆరోపణలొస్తున్నాయి. ఇక పోలీసుల నుంచి కనీసం భరోసా లేకపోవడం వల్ల ప్రాణభయంతో బాధితురాలు వేరే చోటుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com