RED FORT THEFT: ఎర్రకోటలో దొంగలు పడ్డారు

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో దొంగలుపడ్డారు. ఏకంగా కోటి రూపాయలు విలువ చేసే కలశాన్ని ఎత్తుకుపోయారు. ఈ భారీ చోరీ సెప్టెంబర్ మూడో తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎర్రకోట పార్కులో నిర్వహించిన జైన మతపరమైన ఆచారం నుంచి ఒక అమూల్యమైన కలశం మాయమైంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ మత ఆచారానికి వచ్చిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. ఆయనను స్వాగతిస్తున్న సమయంలో … కలశం కనబడలేదు. వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజూ పూజ కోసం ఆ కలశాన్ని తీసుకువచ్చేవారని పోలీసులు తెలిపారు. కలశాన్ని దొంగిలించిన నిందితుడి కదలికలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడిని కూడా గుర్తించారు. ఎర్రకోట సముదాయంలోని జైన సమాజం ఆధ్వర్యంలో కలశ పూజ ఆచారం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఇదే అదునుగా భావించిన దొంగలు కోట్ల రూపాయల విలువైన కలశాన్ని దొంగిలించారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగిలించిన కలశం చాలా విలువైనదని, దాని విలువ దాదాపు రూ. కోటి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. భద్రతా లోపంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల విచారణ షురూ..
పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజాసామగ్రి ఉన్న గదిలోకి వెళ్లి.. రెండు కలశాలను సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అనంతరం అతడు అక్కడి నుంచి బయటకు జారుకున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో కేసు నమోదు చేసి.. గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే పలు ఆలయాల్లో దొంగతనానికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కలశాలను దొంగలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆగస్టు 2న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్స్లో భాగంగా మాక్ డ్రిల్ కోసం స్పెషల్ సెల్ బృందం సాధారణ దుస్తుల్లో వచ్చింది. తమతో పాటు నకిలీ బాంబును తీసుకుని ఎర్రకోటలోకి ప్రవేశించారు. కానీ ఎర్రకోట భద్రత కోసం మోహరించిన పోలీసులు ఆ బాంబును గుర్తించలేకపోయారు. అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు దొంగతనం వెలుగులోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com