తస్మాత్ జాగ్రత్త.. కొత్త తరహా దొంగతనాలు
ప్రశాంతమైన విశాఖ నగరంలో దొంగలు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త పద్దతుల్లో మోసం చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. తమిళనాడు, కేరళకు చెందిన ముఠా సభ్యులు కొత్తతరహా దోపిడీకి దిగారు. దృష్ఠి మరల్చి అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టపగలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీరు చెలరేగిపోవడం వీరి ప్రత్యేకత.
నమ్మకంగా నీతి సూక్తులు వల్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని, మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా మూట కట్టి భద్రపరుచు కోవాలని మొదట సూచిస్తారు. నిజమే అని నమ్మిన వారు విలువైన ఆభరణాలు మూటకట్టి దాచుకోవాలని అంటారు.. ఇలా వారి మాటలు నమ్మామంటే అంతే సంగతి. నిజమైన మూట లాగానే ... మరో మూటను అక్కడ సిద్దం చేసి దోచుకెళుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఈ ముఠా సభ్యులు 55 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలను టార్గెట్ చేసుకొని మహిళలతో మాటలు కలుపుతారు. మంచి మాటలతో నమ్మిస్తారు.. తాము మస్టీలో ఉన్న పోలీసు అధికారులమంటూ నమ్మించి నట్టేట ముంచుతారు.
వారిని నిజమైన పోలీసులని నమ్మి వారి చేతికి విలువైన వస్తువులు ఇచ్చామా అంతే సంగతి. అయితే ఈ తరహా వ్యక్తులపై ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విశాఖ పోలీసులు కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com