భర్త పైశాచికం.. ఉరేసుకుంటున్న భార్యను వీడియో తీసి..

కారణమేదైనా మరీ అంత కఠినంగా ఎలా ఉంటారు.. తెలియని వారైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తేనే అడ్డుకుంటాము.. ఆ ఆలోచన నుంచి వాళ్లని బయటకు తీసుకురావాలనుకుంటాము. కానీ ఇక్కడ భర్తే ఆమెను చావమంటూ చచ్చేలా తిప్పలు పెట్టాడు.. చివరికి ఆమె చావుకు కారణమయ్యాడు. కట్టుకున్న భార్య కళ్లముందే ఉరేసుకుంటే ఆపే ప్రయత్నం చేయకపోగా అదో అద్భుత దృశ్యం అన్నట్లు వీడియో తీసి దాన్ని భార్య తరపు బంధువులకు పంపించాడు. అతడి శాడిజమ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ హృదయవిదారక ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం వెలుగుచూసింది. ఎస్సై శివవంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు జగన్నాథరావుపేటలో ఉంటున్న పెంచలయ్యకు అనంతసాగరం మండలం కొత్తపల్లికి చెందిన కొండమ్మ (31) తో వివాహమైంది. భర్త ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డు కాగా, కొండమ్మ ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పని చేస్తున్నారు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న భర్త పెంచలయ్య ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.
దీంతో ఆమె విసుగు చెంది ఆత్మహత్యకు ప్రయత్నించింది. భర్త ముందే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు సిద్ధమైంది. ఎదురుగా ఉన్న భర్త ఆమె ప్రయత్నాన్ని ఆపకుండా వీడియో తీస్తాను.. ఉరి వేసుకో.. వేసుకో అంటూ ప్రోత్సహించాడు. అతడి కళ్లముందే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పెంచలయ్య.. భార్య ఉరి వేసుకున్న వీడియోను బంధువులకు పంపించాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పెంచలయ్యను అరెస్టు చేశారు.. కొండమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com