A1 Criminal: పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న A1 నిందితుడు

A1 Criminal: రంగారెడ్డి జిల్లాలో పోలీస్ కస్టడీ నుంచి A1 నిందితుడు తప్పించుకున్నాడు. ఈ వేకువజామున నిందితుడు హర్షద్ ఖాన్‌ను జైలుకు తరలిస్తుండగా పారిపోయాడు. దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటీ, శంకర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు.
నిన్న ఈ ముఠా సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టారు డీసీపీ ప్రకాష్ రెడ్డి. ఈ తెల్లవారుజామున జైలుకు తరలిస్తుండగా.. టాయిలెట్ వస్తోందని చెప్పి కిందకు దిగిన నిందితుడు హర్షద్ ఖాన్.. పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాత్రి వేళల్లో ఒంటరిగా వెళుతున్న వాహనదారులను టార్గెట్ చేసేవారు. వారిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తూ దోపిడీలకు పాల్పడుతుండేవారు. ఈ విధమైన అరాచకాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిన్న సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి, చేవెళ్ల, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్న ఆగంతకులతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో మహమ్మద్ హర్షద్ ఖాన్ ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో హర్షద్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com