Drugs Case: డ్రగ్స్‌ ఎస్సై రాజేంద్ర కేసు దర్యాప్తులో కొత్తకోణాలు

Drugs Case: డ్రగ్స్‌ ఎస్సై రాజేంద్ర కేసు దర్యాప్తులో కొత్తకోణాలు
ఎస్సై రాజేంద్ర అరెస్టయినపుడు 1,750 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం మిగిలిన 250 గ్రాముల మత్తుపదార్థం గురించి ఆరా

డ్రగ్స్‌ విక్రయించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల అరెస్టయిన సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఎస్సై రాజేంద్ర కేసు దర్యాప్తులో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్సై వెనుక ఉన్న అజ్ఞాతశక్తి ఎవరనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. నగర వైద్యుడికి 26 లక్షల రూపాయలు టోకరా వేసిన కేసులో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ముంబయిలో ఉంటున్న నైజీరియన్‌ ఒకెరొకో ఇకేబీని ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్సై రాజేంద్ర, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు అక్కడకు చేరారు. నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ కేసులో నిందితుడైన ఇతడి కోసం ముంబయి పోలీసులూ గాలిస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసులు ఈ నిందితుడిని అదుపులోకి తీసుకొని అక్కడి న్యాయస్థానంలో హాజరుపరచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. కూకట్‌పల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా బెయిల్‌ ఇవ్వడంతో బయటకు వచ్చాడు.

ఐతే.. నైజీరియాకు చెందిన ఒకెరొకో ఇకేబీ వ్యాపార వీసాతో ముంబయిలో ఉంటూ మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలు ప్రారంభించాడు. ఇతడిని అరెస్ట్‌ చేసేందుకు ముంబయి పోలీసులు గాలిస్తున్న సమయంలో, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసి ఇద్దరు తప్పించుకొని పారిపోగా, ఇకేబీని అదుపులోకి తీసుకున్నారు. అతడి నివాసంలో 5 కిలోల మెథకొలిన్‌లో 3 కిలోలు ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 2 కిలోలున్న సంచిని ఎస్సై రాజేంద్ర తీసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరిచే సమయంలో 4 మొబైల్‌ఫోన్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఎస్సై తెచ్చింది ఖాళీ సంచిగా పోలీసు అధికారులు భావించారు.


ఇటీవల ఎస్సై అరెస్టయినపుడు అతడి వద్ద 1,750 గ్రాముల డ్రగ్స్‌ రాయదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 250 గ్రాముల మత్తుపదార్థం గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. 2013లో రాజేంద్ర లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2022 సెప్టెంబరులో ఇదే కేసులో రెండేళ్ల జైలుశిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం శిక్ష విధించిన తర్వాత కొద్దికాలం మాదాపూర్‌ అడ్మిన్‌ ఎస్సైగానే రాజేంద్ర విధులు నిర్వర్తించాడు. అవినీతి కేసులో అరెస్టయినా... ఇద్దరు పోలీసు అధికారులు సదరు ఎస్సై పోలీసుశాఖలో కొనసాగాలని ధ్రువీకరిస్తూ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. తాజాగా డ్రగ్స్‌ కేసులో ఎస్సై రాజేంద్రపై పోలీసులు స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. ఎస్సై వెనుక ఉన్న అజ్ఞాతశక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story