క్రైమ్

వీడని గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్‌ రేప్‌ మిస్టరీ.. చిక్కని మరో మహిళ ఆచూకీ..!

గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్‌ రేప్‌ మిస్టరీ వీడటం లేదు. అదృశ్యం అయిన మరో మహిళ ఆచూకీ చిక్కడం లేదు.

వీడని గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్‌ రేప్‌ మిస్టరీ.. చిక్కని మరో మహిళ ఆచూకీ..!
X

గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్‌ రేప్‌ మిస్టరీ వీడటం లేదు. అదృశ్యం అయిన మరో మహిళ ఆచూకీ చిక్కడం లేదు. గాంధీ ఆస్పత్రిలోని మొత్తం 189 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎక్కడా అక్కాచెల్లెళ్ల జాడ లేదు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు, ఆస్పత్రిలోని పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. దీంతో గాంధీలో గ్యాంగ్‌ రేప్‌ వ్యవహారం మిస్టరీగా మారింది.

తెలంగాణలో గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్‌ రేప్‌ ఘటన సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం దర్యాప్తు వేగవంత చేసింది. అదృశ్యమైన బాధితురాలి సోదరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇద్దరు మహిళలకు కల్లు తాగే అలవాటు ఉన్నందున సమీపంలోని కల్లు దుకాణాల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ సోదరి బయటకు వెళ్లే సీసీటీవీ దృశ్యాలను సేకరించారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లిందనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం వ్యవహారంలో చిలకలగూడ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నిందితులుగా అనుమానిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వరరావు, సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు. కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు మహిళలు అదృశ్యమైన నాటి నుంచి కుటుంబసభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న కోణంలోను పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎంత విచారించినా తాము అత్యాచారం చేయలేదని నిందితులు చెబుతున్నట్లు తెలుస్తోంది. భరోసా కేంద్రానికి తరలించిన బాధితురాలు.. విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు.

గాంధీ ఆస్పత్రిలో మహిళలపై అత్యాచారం ఘటనపై సూపరింటెండెంట్‌ రాజారావు స్పందించారు. ఆస్పత్రి ఆవరణలో అత్యాచారం జరిగే అవకాశం లేదన్నారు. ఘటన జరిగిన ప్రాంతం కూడా పూర్తిగా జనసంచారం ఉన్న ప్రాంతమని తెలిపారు. ఆస్పత్రిలో 180కి పైగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని... ఆ ఫుటేజ్‌ పోలీసుల వద్ద ఉందని తెలిపారు. అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టెక్నీషియన్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో నేరం రుజువైతే చట్టపరమైన చర్చలు తీసుకుంటామని రాజారావు అన్నారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. గాంధీకి చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులతో విచారణ కమిటీని నియమించింది. అత్యాచారం జరిగిందని చెబుతున్న మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదిక వస్తే గాంధీలో గ్యాంగ్‌రేప్ ఎపిసోడ్‌ చిక్కుముడి వీడే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES