లాయర్ దంపతుల హత్య కేసు.. ఆ రెండు వీడియోలు చిత్రీకరించిన వారి కోసం పోలీసులు ఆరా

లాయర్ దంపతుల హత్య కేసు.. ఆ రెండు వీడియోలు చిత్రీకరించిన వారి కోసం పోలీసులు ఆరా
దాడి చేసిన అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న వామన్‌రావును ఓ వ్యక్తి పలకరించగా మొదట పుట్ట మధు పేరు చెప్పారు

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితులైన కుంట శ్రీను, చిరంజీవి, అప్పాల కుమార్‌‌లను పోలీసులు మంథని జడ్జి ఎదుట హాజరుపరిచారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హత్య కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనేది పోలీసుల విచారణలో తేలనుంది. మరోవైపు పోలీసులు నిందితులను హత్య జరిగిన ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో ఏ1గా గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్‌, ఏ2గా విలోచవరానికి చెందిన శివందుల చిరంజీవి, ఏ3గా గుంజపడుగుకు చెందిన అక్కపాక కుమార్‌(44)లను చేర్చారు. నిందితులపై ఐపీసీ 302, 341, 120బి రెండ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

న్యాయవాద దంపతుల హత్యకు నిందితులు రెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌వేసి.. అమలు చేసినట్లు తెలుస్తోంది. వామన్‌రావును చంపాలనే కుంట శ్రీనివాస్‌ ప్లాన్‌ వేసినా.. కారులో నాగమణి కూడా ఉండటంతో సాక్ష్యం ఉండకూడదనే ఉద్దేశంతో ఆమెను కూడా హతమార్చినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపినట్లు తెలుస్తోంది. అటు నాలుగో నిందితుడైన పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కేస్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు ముందు నిందితులను హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.

మరోవైపు బిట్టు శ్రీను పోలీసులకు చిక్కడంతో హత్యల్లో మిగతావారి పాత్రపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు చెందిన పుట్టా లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూడడంలో కీలక పాత్ర పోషిస్తున్న బిట్టు శ్రీను.. ఎందుకు కుంట శ్రీనుకు సహకరించాడు.. కారు, కత్తులు ఎందుకు ఇచ్చాడు అనేది తేలాల్సి ఉంది. అటు పుట్టా మధుకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోని బిట్టు శ్రీను.. హత్యకు ఆయుధాలు, వాహనాన్ని సమకూర్చే అవకాశమే లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసల సూత్రధారులను కాపాడేందుకే బిట్టు శ్రీనును తెరపైకి తీసుకొచ్చారని విమర్శిస్తున్నాయి. కేసును నీరుగార్చేందుకే పోలీసులు కుట్ర పన్నుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

న్యాయవాద దంపతుల హత్యకు రెండు వీడియోలు పోలీసులకు కీలకంగా మారడంతో ఆ వీడియోలు చిత్రీకరించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడి చేసిన అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న వామన్‌రావును ఓ వ్యక్తి పలకరించగా మొదట పుట్ట మధు పేరు చెప్పి అటు తర్వాత కుంట శ్రీనివాస్‌ పేరు.. గ్రామం పేరు చెప్పినట్లు వీడియోలో ఉంది. వామన్‌రావు మరణ వాంగ్మూలంగా పోలీసులు ఆ రికార్డును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా రికార్డులో పుట్ట మధు పేరు వినిపిస్తుండటంతో ఆ రికార్డుపై పోలీసులు దృష్టి సారించారు. ఇంకేమైనా వీడియోలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story