ఇంటి ఓనర్ రెంట్ అడిగినందుకు.. దారుణంగా..

ఇంటి ఓనర్ రెంట్ అడిగినందుకు.. దారుణంగా..
Palakollu: అద్దె కట్టలేని పరిస్థితి వస్తే సర్ది చెప్పుకోవాలి.. అవసరమైతే బతిమాలుకోవాల్సింది పోయి అద్దె అడిగిన పాపానికి అన్యాయంగా ఓ నిండు జీవితానికి ముగింపు పలికాడు అద్దెకున్న వ్యక్తి. ఇప్పుడు జైల్లో కూర్చొని ఊచలు లెక్కబెడుతున్నాడు.

అసలు అడక్కుండానే ఫస్ట్ తారీకు లేదంటే అయిదో తారీకు లోపు అద్దె ఇచ్చేస్తే యజమాని వచ్చి పదే పదే అడిగే పని ఉండదు.. పోనీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇస్తామనో.. సగం ఇస్తామనో చెప్పుకుంటే సరిపోయేది.. అద్దె అడిగినందుకు ఆ ఇంటి యజమానిని దారుణంగా హతమార్చడం అన్యాయం.. ఈ అమానవీయ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చోటు చేసుకుంది. ముచ్చర్లవారి వీధిలోని వంగా ప్రసాద్ (50) ఇంట్లో ఏడాది కాలంగా చినకొండయ్య కుటుంబం అద్దెకు ఉంటోంది.

రెండు నెలలుగా ఇంటి ఓనర్‌కి అద్దె చెల్లించడం లేదు. దీంతో ఇదే విషయంపై ఓనర్ వంగా ప్రసాద్‌కి, అద్దెకుంటున్న చిన కొండయ్యకు మధ్య సోమవారం రాత్రి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది.. గొడవ పెద్దదైంది. కొండయ్య కోపంతో ఊగిపోతూ పక్కనే ఉన్న బండరాయితో యజమాని తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షణికావేశంలో తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారి ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story