TERROR ATTACK: ఉగ్రవాదుల అడ్డా.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ..?

ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్, ఎర్రకోట పేలుడు ఘటనతో ఇప్పుడు దర్యాప్తు ఏజెన్సీల దృష్టి ‘అల్ - ఫలాహ్’ యూనివర్సిటీపై పడింది. వైద్యులు, టీచర్ల ముసుగులో ఈ విశ్వవిద్యాలయంలో చేరిన కొందరు దీన్ని తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఒకప్పుడు ప్రతిష్ఠాత్మక జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కన్పించిన ‘అల్-ఫలాహ్ ఇప్పుడు ఉగ్ర కుట్రలకు కేంద్రంగా వార్తల్లో నిలవడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో గుబులు పట్టుకుంది. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లా ధౌజ్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్-ఫలాహ్ యూనివర్సిటీ విస్తరించి ఉంది. హరియాణా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటుచేశారు. 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా మొదలైంది. 2013లో యూజీసీకి చెందిన నాక్ నుంచి ‘ఏ’ గ్రేడ్ అందుకుంది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది.
వైద్యులను ఉగ్రవాదులుగా మార్చిన మౌల్వీ
దేశ రాజధాని ఢిల్లీ పేలుడు దర్యాప్తులో.. ఉగ్రవాద రిక్రూట్మెంట్, ఆపరేషన్లలో ఎవరూ ఊహించని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా షోపియాన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే అలియాస్ ఇమామ్ ఇర్ఫాన్.. ఈ 'వైట్-కాలర్' ఉగ్ర నెట్‌వర్క్‌కు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదట్లో మత గురువుగా ఉన్న ఇమామ్ ఇర్ఫాన్.. ఆ తర్వాత పారామెడికల్గా మారి వైద్యులను ఉగ్రవాదులుగా మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా GMC శ్రీనగర్‌లో అతనికున్న పరిచయాలు, నౌగామ్‌లోని స్థానిక మసీదుల్లో అతను చేసే మత ప్రసంగాల ద్వారా.. సులభంగా ప్రభావితమయ్యే విద్యావంతులైన యువతను గుర్తించి, వారిని రాడికలైజేషన్ వైపు నెట్టేవాడని సమాచారం. ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ గతంలో శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశారు. నౌగామ్‌లోని ఒక మసీదులో కలిసిన అనేక మంది విద్యార్థులతో ఆయన సంబంధాలు కొనసాగించారు. ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులను అహ్మద్ క్రమంగా తీవ్రవాద ఆలోచనలతో ప్రభావితం చేశాడని, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అతనికి స్ఫూర్తినిచ్చిందని వారు తెలిపారు.
జైషే మహ్మద్ వీడియోలను
ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ తన -స్టూడెంట్ లకు జైషే మహ్మద్ వీడియోలను రోజూ చూపించి మోటివేట్ చేసేవాడని తెలిపారు. అహ్మద్ డేటా కనెక్షన్ ఉపయోగించి చేసిన కాల్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోని కొంతమందితో సంప్రదింపులు జరిపేవాడని పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల మనస్సులలో తీవ్రవాద ఆలోచనలను లోతుగా చొప్పించడమే అతని లక్ష్యంగా పెట్టుకున్నాడని తెలిపారు. ముజమ్మిల్ షకీల్, మహ్మద్ ఉమర్ అనే ఇద్దరు వైద్యులు ఈ మిషన్‌ను చురుకుగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిసిందన్నారు. మొత్తం మాడ్యూల్‌ను అహ్మద్ రూపొందించారని వెల్లడించారు. ఫరీదాబాద్ మాడ్యూల్ బయటపడిన తర్వాత తీవ్ర భయాందోళనకు గురై ఢిల్లీ పేలుడుకు మహమ్మద్ ఉమర్ పాల్పడ్డాడని వర్గాలు తెలిపాయి. ఉమర్‌కు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నివసిస్తున్న డాక్టర్ షాహీన్ సయీద్ ఈ మాడ్యూల్‌కు ఫైనాన్షియర్ అని వెలుగులోకి వచ్చింది. ఆమె అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా తెల్చారు. ఈమె జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగంలో పనిచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

