పెద్దపల్లి జంట హత్యల కేసులో ట్విస్ట్‌లు

పెద్దపల్లి జంట హత్యల కేసులో ట్విస్ట్‌లు
మంథని న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిల హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు.

అడ్వకేట్‌ వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ అనే ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నట్టు గుర్తించి.. పట్టుకున్నారు. నడిరోడ్డుపై వామన్‌రావును నరికి చంపింది.. కుంట శ్రీనివాస్, చిరంజీవి అని గుర్తించారు. వామన్‌రావు దంపతుల కదలికలపై కుమార్ రెక్కీ నిర్వహించినట్టు తేల్చారు.

ఎఫ్‌ఐఆర్‌లో కుంట శ్రీనును A1గా, చిరంజీవిని A2గా , కుమార్‌ను A3గా చేర్చారు. మంథని న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిల హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. న్యాయవాది వామనరావు, నిందితుడు కుంట శ్రీనుది గుంజపడుగు గ్రామం. ఇద్దరి మధ్య చాలా రోజులుగా వివాదాలు ఉన్నాయని చెప్పారు. గ్రామంలోని ఆలయ భూమి విషయంలో వివాదం చెలరేగినట్లు వెల్లడించారు. ఈ విషయంలో వామనరావు న్యాయపరంగా వెళ్లడాన్ని.. తట్టుకోలేకనే హత్య చేసినట్టు వివరించారు. హత్యకు వాడిన వాహనం... బిట్టు శ్రీను అనే వ్యక్తిదని తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతుందని చెప్పారు.

మరోవైపు.. హత్యలకు ముందు కుంట శ్రీను ఏం చేశాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు దుబ్బుపల్లి ఆలయంలో కుంట శ్రీను పూజలు చేసిన పోటోలు, TRS కార్యక్రమాల్లో కుంట శ్రీను పాల్గొన్నట్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హత్యలకు ముందు ఏదో జరగబోతోందనే సమాచారం పోలీసులకు అందిందినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే డబుల్ మర్డర్ కేసులో ఏం జరిగింది..లాయర్లను చంపించేంత పగ ఎవరికి ఉంది అనేది కూడా మిస్టరీగా మారింది. జంట హత్యలు పూర్తి వ్యక్తిగత కక్ష వల్లో.. లేక రాజకీయ కోణమూ ఉందా అనే ప్రశ్నను పోలీసులు తేల్చబోతున్నారు.

అటు.. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో గట్టు వామనారావు, నాగమణి అంత్యక్రియలు ముగిశాయి. వీరి అంతిమయాత్రలో గ్రామ ప్రజలు, బంధువులు, స్నేహితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో నేషనల్‌ ఫెడరేషన్ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సభ్యులు హాజరయ్యారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మంథని నుంచి తిరుగుప్రయాణంలో గట్టు వామనరావు ఫ్యామిలీని పక్కా ప్లాన్‌తోనే మర్డర్ చేసినట్టు తెలుస్తోంది. నంబర్ ప్లేట్ లేని కారులో వాళ్లు రావడం, కత్తులతో దారుణంగా నరికి చంపి పారిపోవటం చూస్తుంటే.. వామనరావు కుటుంబ కదలికలపై ఎవరో సమాచారం ఇచ్చారనే అనుమానాలు బలపడుతున్నాయి. వామనరావు కార్ డ్రైవర్‌ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అటు.. వామనరావు, నాగమణి హత్యల్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తిచేయాలని చెప్పింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలుపుకోవాలని పేర్కొంది. సాక్షాల్ని పకడ్బందీగా సేకరించాలని సూచించింది. న్యాయవాదుల హత్య..తీవ్ర గర్హనీయమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని.. నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి1కి వాయిదా వేసింది హైకోర్టు.


Tags

Read MoreRead Less
Next Story