Crime News: దారుణం.. అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించి..

Crime News: తప్పు చేసిన వాడికి సరైన శిక్ష పడితే కదా మరొకడు తప్పు చేయకుండా ఉండేది.. కేసులను సంవత్సరాల తరబడి సాగదీస్తారు.. నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నాం అంటారు. కళ్ల ముందు సాక్ష్యాలు కనబడుతున్నా ఇంకెవరో వచ్చి ఏదో చెప్పాలని కేసుల్ని వాయిదా వేస్తుంటారు. ఈలోపు ఇంకోచోట ఇలాంటి కేసే పునరావృతమవుతుంది. చట్టాలు కఠినంగా మారిననాడే దేశంలో మహిళకు రక్షణ ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ తమోలి పూర్వా గ్రామంలోని చెరకు తోటలో ఇద్దరు దళిత సోదరీమణులు చెట్టుకు ఉరివేసుకుని మరణించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని అపహరించి చంపారని తల్లి రోదిస్తూ పోలీసులకు తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన కుమార్తెలను కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత చెరుకు పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చెట్టుకు వేలాడదీశారని ఆమె తెలిపారు.
ప్రధాన నిందితుడు చోటూ తన స్నేహితులతో కలిసి బాధితుల ఇంట్లోకి చొరబడి బలవంతంగా మోటర్‌బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఇద్దరు మైనర్ సోదరీమణుల మృతదేహాలను వారి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్‌మార్టం నివేదిక రావల్సి ఉంది.
జంట మరణాలపై రాజకీయ నేతలు స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై దాడి చేశారు, రాష్ట్రంలో మహిళలపై "పెరుగుతున్న" నేరాలు,జంట మరణాలను హత్రాస్ గ్యాంగ్ రేప్, హత్యతో పోల్చారు.
SP అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ.. "ఇద్దరు దళిత సోదరీమణులను అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా పోస్ట్‌మార్టం నిర్వహించారు. లఖింపూర్‌లో రైతుల తర్వాత, దళితుల హత్య ఇప్పుడు మళ్లీ పునరావృతమైంది అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. "లఖింపూర్ (యూపీ)లో ఇద్దరు సోదరీమణులను హత్య చేసిన సంఘటన హృదయాన్ని కదిలించింది. పట్టపగలు బాలికలు అపహరణకు గురయ్యారని బంధువులు చెబుతున్నారు. ప్రతిరోజూ వార్తాపత్రికలు, టీవీల్లో తమ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు మెరుగుపడవు. యూపీలో మహిళలపై నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి అని ఆమె యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక గ్రామస్తులు, బాలికల కుటుంబీకులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. శాంతి భద్రతలను నిలువరించేందుకు భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com