ఆ గాయం కారణంగానే అప్సర చనిపోయింది

ఆ గాయం కారణంగానే అప్సర చనిపోయింది
అప్సర ప్రిలిమినరీ పోస్ట్‌ మార్టం రిపోర్టుతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి

అప్సర ప్రిలిమినరీ పోస్ట్‌ మార్టం రిపోర్టుతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎడమ వైపు తలకు బలమైన గాయం అయినట్లు రిపోర్టులో వైద్యులు తెలిపారు. ఆ గాయం కారణంగానే అప్సర మృతి చెందినట్లు అందులో వెల్లడించారు. ఇక అప్సర గర్భవతి కాలేదని తేల్చారు వైద్యులు. పోస్టు మార్టం పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కాసేపట్లో అంబర్‌పేట శ్మశాన వాటికలో అప్సర అంత్యక్రియలు జరగనున్నాయి.

మరోవైపు అప్సర హత్య కేసులో నిందితుడు వెంకట సాయికృష్ణ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. పొంతనలేని సమాధానాలు చెబుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. అప్సరను తాను శారీకంగా కలువలేదని.. అప్సరకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని సాయికృష్ణ పోలీసులకు చెప్పాడు. అతడు చెన్నైలో ఉంటాడని.. అతని ద్వారా అప్సర గర్భం దాల్చినట్లు వెల్లడించాడు. ఇక గర్భం దాల్చిన విషయాన్ని తనకు జనవరిలో అప్సర చెప్పిందన్నాడు.

అప్సర మర్డర్‌ కేసులో పూజారి వెంకట సాయికృష్ణను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. సాయికృష్ణపై 302, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన బిడ్డను మాయమాటలతో మోసగించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లి అరుణ అన్నారు. అతడు తనను అక్కా అని పిలుస్తుండేవాడని.. ఇంటికి వచ్చి భోజనం చేసేవాడని, స్నేహంగా మెలిగేవాడని తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని కలలోనూ అనుకోలేదని రోదించారు.

ఇక వెంకటసాయికృష్ణది తూర్పుగోదావరి జిల్లా. కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చిన సాయికృష్ణ.. సరూర్‌నగర్‌ శ్రీవేంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన అతడు కాంట్రాక్టర్‌గా.. బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగానూ పనిచేస్తున్నాడు. 2010లో సాయికృష్ణకు వివాహమైంది. భార్య, కూతురు ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో చెన్నైకి చెందిన అప్సర కుటుంబం ఇదే కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. రోజూ బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లేది. అక్కడ వెంకటసాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. సినిమాల్లో అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానంటూ.. అప్సరను లొంగదీసుకున్నాడు.

ఈ నెల 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను వెంకటసాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొన్నానంటూ చెప్పాడు. నిజమేననుకున్న అప్సర లగేజీతో సహా ప్రయాణానికి సిద్ధమైంది. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్‌లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్‌పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్‌ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్‌ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో అప్సర ప్రాణాలు కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story