ATM: నగదుతో ఉడాయించిన వ్యాన్ డ్రైవర్..దోచుకెళ్లింది ఎంతో తెలిస్తే..

ATM: 50 లక్షలు ఏటీఎంలలో నింపాల్సి ఉండగా ఆ నగదుతో ఉడాయించాడో డ్రైవర్. ఈ ఘటన నెల్లూరు నగరంలో చోటుచేసుకుంది. సెక్యూర్ వాల్యూ కంపెనీ ప్రతినిధులు వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి భద్రతా సిబ్బంది సాయంతో వివిధ ఏటీఎంలలో ఉంచుతారు. రోజు వారీగానే నిన్న సిబ్బంది శివకృష్ణ, సారాయి అంగడి ప్రాంతానికి చెందిన వ్యాన్ డ్రైవర్ పోలయ్యతో కలిసి మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు వెళ్లారు. డ్రైవరును వ్యాన్ వద్దే ఉంచి.. బ్యాంకు లోపలికి వెళ్లి 50 లక్షలు డ్రా చేసుకొచ్చారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని యాక్సిస్ బ్యాంకులో నగదు డ్రా చేసుకొచ్చేందుకు వెళ్లారు.
మొదటిసారి డ్రా చేసుకొచ్చిన నగదు వ్యాన్‌లోనే ఉంచి.. లోపలికి వెళ్లి 12లక్షల 50వేలు డ్రా చేసుకుని బయటికి వచ్చారు. తీరా బయటికి వచ్చాక.. వ్యాన్ కనిపించలేదు. అనుమానం వచ్చి డ్రైవర్ పోలయ్యకు ఫోన్ చేశారు. టైరు పంక్ఛర్ అయిందని, 15 నిమిషాల్లో వస్తానని బదులిచ్చారు. ఎంతకీ రాకపోవడంతో మరోసారి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో కంపెనీ మేనేజరు వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే వ్యానులోని జీపీఎస్‌ను నిలిపివేసి ఉంది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో చిన్నబజారు పోలీసులను ఆశ్రయించారు.
డ్రైవర్ పోలయ్య కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశామని, టోల్‌ప్లాజాల వద్ద తనిఖీలు, సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ కేసును ఛేదించేందుకు సీసీఎస్ పోలీసులూ రంగంలోకి దిగినట్లు తెలిపారు. పోలయ్య కుటుంబ సభ్యులను సైతం విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com