Kondapur: యువతితో భర్త పరిచయం.. తట్టుకోలేక దారుణానికి పాల్పడిన భార్య..

Kondapur: హైదరాబాద్ కొండాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. సాటి యువతి అని చూడకుండా ఓ మహిళ కర్కకషంగా ప్రవర్తించింది. సభ్యసమాజం తలదించుకునేలా.. మహిళలకు మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. తన భర్తకు మరో యువతి పరిచయాన్ని భరించలేకపోయింది. మాట్లాడాలంటూ యువతిని ఇంటికి పిలిపించుకుని నలుగురు యువకులతో చిత్రహింసలు పెట్టిన వైనం సంచలనమవుతోంది.
కొండాపూర్ శ్రీరామ్ నగర్‌కు చెందిన గాయత్రికి శ్రీకాంత్ తో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అదే కాలనీలో ఉంటున్న యువతితో.. గాయత్రి భర్త శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయంపై గాయత్రి అనుమానం పెంచుకుంది. మాట్లాడాలంటూ యువతిని ఈ నెల 26న తన ఇంటికి రప్పించింది సదరు మహిళ. ఇంట్లోకి రాగానే అంతకుముందే వేసిన ప్లాన్ ప్రకారం యువతిని గదిలో బంధించింది.
అప్పటికే ఆ గదిలో ఉన్న నలుగురు యువకులు యువతిని దారుణంగా హింసించారు. నోట్లో గుడ్డలు కుక్కి, యువతి శరీరంపై గాయపరుస్తుండగా . గాయత్రి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. దాడి విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని యువతిని వార్నింగ్ ఇచ్చింది గాయత్రి. తీవ్ర రక్తస్రావంతో ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకొన్న గచ్చిబౌలి పోలీసులు గాయత్రితోపాటు నలుగురు యువకులను రిమాండ్‌కు తరలించారు. అటు ఆడపిల్లను దారుణంగా హింసించటంపై గాయత్రి తల్లి మండిపడింది. గాయత్రికి ఏ శిక్షవేసిన సంతోషమేనని నిందితురాలి తల్లి స్పష్టం చేసింది. శ్రీకాంత్ సహకరించటం వల్లే ఈ దారణం జరిగిందన్న ఆమె.. శ్రీకాంత్‌ను ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com