కర్ణాటకలో రామనగర జిల్లా మాగడిలో దారుణం జరిగింది. భార్య అందంగా ఉండటం... బాగా బాగా తయారై బయటకు వెళ్లడాన్ని సహించలేని భర్త... ఆమెను హత్య చేశాడు. ఉమేశ్ తన భార్య దివ్యను హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఇటీవల దివ్య టాటూ వేయించుకుంది. ఇంకా అందంగా కనపడాలని అలంకరించుకునేది. ఈ పద్ధతులు నచ్చని ఉమేశ్ ఆమెను గుడికి తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి కడతేర్చాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేశారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా ఉమేశ్, మరొకరి కోసం గాలిస్తున్నారు. భార్య ఎంతో అందంగా ఉండటం, గ్రామంలో బాగా తయారై బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఇదే విషయమై అనేకసార్లు గొడవ కూడా పడ్డారని తేలింది. ఆఖరికి నమ్మించి బయటకు తీసుకెళ్లి దివ్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అందంగా కనపడాలనే తపనతో దివ్య ఎప్పుడూ లిప్‌స్టిక్ వేసుకునేదని... ఈ పద్ధతులు నచ్చని ఉమేశ్ ఆమెతో గొడవ పడేవాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భర్త అనుమానాలు, వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం మాగడి ఫ్యామిలీ కోర్టులో దివ్య విడాకుల పిటిషన్ వేశారు. ఇద్దరూ విచారణకు హాజరుకాగా ఇకపై అనుమానించనని దివ్యను ఉమేశ్ నమ్మించాడు. భర్త మారాడనుకుని అతడితో కలిసి దివ్య స్థానిక ఊజగల్లు దేవాలయానికి వెళ్లింది. అయితే ఆమెను హత్య చేయాలని ముందే నిశ్చయించుకున్న ఉమేశ్.. దర్శనం అనంతరం అక్కడి కొండ వద్దకు దివ్యను తీసుకెళ్లి తన నలుగురు స్నేహితులతో కలిసి కడతేర్చాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com