Avinash Jha: యంగ్ జర్నలిస్ట్ అవినాష్ జా హత్య.. సగం కాలిన శవాన్ని గుర్తించిన పోలీసులు..

Avinash Jha (tv5news.in)
Avinash Jha: బిహార్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల జర్నలిస్టు, RTI యాక్టివిస్ట్ బుద్ధినాథ్ జా అలియాస్ అవినాష్ జా దారుణ హత్యకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ అయిన అవినాష్ జా డెడ్‌బాడీని శుక్రవారం సాయంత్రం మధుబని జిల్లాలోని ఓ గ్రామ శివారులో రోడ్డు పక్కన కాలిన స్థితిలో గుర్తించారు. బెనిపట్టి లోహియా చౌక్ లోని ఆయన ఇంటి దగ్గర సీసీ టీవిని పరిశీలించారు పోలీసులు.
మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత అవినాష్ ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చివరగా రాత్రి 9 గంటల 58 నిమిషాల టైంలో యెల్లో స్కార్ఫ్ ధరించి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. తర్వాత రాత్రి పది గంటల 10 నిమిషాల టైంలో లోకల్ మార్కెట్‌లో అవినాష్‌ను స్థానికుడు ఒకరు చివరిసారిగా చూసినట్లు పోలీసులు చెప్పారు. తర్వాత నుంచి అవినాష్ కనిపించకుండా పోయాడు.
తెల్లవారు కుటుంబసభ్యులు లేచి చూసేసరికి అవినాష్ ఇంటి దగ్గర లేడు. ఆయన మోటార్ సైకిల్ ఇంటి దగ్గరే ఉందని చెప్పారు పోలీసులు. అవినాష్ క్లినిక్ ఓపెన్ చేసి ఆయన ల్యాప్‌టాప్ కూడా ఆన్ చేసి ఉందని చెప్పారు. తర్వాత కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. అవినాష్ ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు చివరిసారిగా బుధవారం ఉదయం 9 గంటల టైంలో బెనిపట్టికి 5 కిలోమీటర్ల దూరంలోని బెటౌన్ దగ్గర స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు.
గురువారం పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. ఐతే శుక్రవారం అవినాష్ సోదరుడు BJ వికాస్ బెటౌన్ గ్రామ శివారులో డెడ్ ఉందని సమాచారం తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు వేలికి ఉన్న ఉంగరం, మెడలో ఉన్న చైన్ ఆధారంగా డెడ్‌బాడీ అవినాష్‌దేనని గుర్తించారు. తర్వాత డెడ్‌బాడీని పోస్టుమార్టమ్‌కు తరలించారు పోలీసులు. తర్వాత ఫ్యామిలీకి అప్పగించారు. ఇవాళ అవినాష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అవినాష్ జా స్థానిక న్యూస్ పోర్టల్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. వారం క్రితం ఫేస్‌బుక్‌లో ఫేక్ మెడికల్ క్లినిక్‌లకు సంబంధించి పోస్టు పెట్టారు అవినాష్. తర్వాత రెండు రోజులకే ఆయన కనిపించకుండా పోయారు. అవినాష్ ఫేస్‌బుక్ పోస్టు.. కొన్ని మెడికల్ క్లినిక్‌ల మూసివేతకు కారణమవగా..మరికొన్నింటిపై భారీ జరిమానాలకు దారి తీసింది.
మెడికల్ క్లినిక్‌ల గురించి రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో అవినాష్‌కు లక్షల రూపాయల ఆఫర్లతో పాటు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఐతే వాటికి లొంగకుండా అవినాష్ ముందుకెళ్లాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీస్ స్టేషన్ కు 400 మీటర్ల దూరంలోనే అవినాష్ ఇల్లు ఉందని.. అలాంటి ఏరియాలో అవినాష్‌ను ఎలా కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com