రాబోయే ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్‌కు కాలం కలిసొస్తుందా

రాబోయే ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్‌కు కాలం కలిసొస్తుందా
వరుస ఓటములతో నిరాశా నిస్పృహల్లో ఉన్న పొన్నం ప్రభాకర్‌ను ఈసారైనా అదృష్టం వరిస్తుందా ? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో

వరుస ఓటములతో నిరాశా నిస్పృహల్లో ఉన్న పొన్నం ప్రభాకర్‌ను ఈసారైనా అదృష్టం వరిస్తుందా ? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారా? ఎంపీగా బరిలో దిగేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారా పాదయాత్రలో పొన్నం ప్రభాకర్‌పై రేవంత్‌రెడ్డి ప్రశంసలు కురిపించింది అందుకేనా ? ఎన్నికలకు సమయమున్నా ముందుగానే బెర్తులు కన్ఫమ్ చేసుకుంటున్నారా? కరీంనగర్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా కాలం కలిసిరావడంలేదనే టాక్ వినిపిస్తోంది. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన పొన్నం తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లేచేశారు. విభజన బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రేకు గురవడంతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన పొన్నం రాష్ట్ర విభజన తర్వాత సొంత రాష్ట్రంలో రాజకీయంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. తెలంగాణ అవిర్భవించిన తర్వాత తమ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందనుకున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే సీన్ రివర్స్ కావడంతో కాంగ్రెస్ ఎంపీగా రెండో సారి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

2014 ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన పొన్నం ప్రభాకర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో మూడవ స్దానానికి పడిపోవడంతో పొన్నం ప్రభాకర్ అప్పట్లో తీవ్ర ఆవేదనకు గురయ్యారట. రెండు సార్లు ఓడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో సానుభూతి పని చేస్తుందని భావించిన పొన్నం ప్రభాకర్ మరోసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. అయినా ప్రజలు పొన్నం ప్రభాకర్ ను తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు పొన్నం ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో సిట్టింగ్ ఎంఎల్ఎ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు బీజేపీ నుండి బండి సంజయ్ ఉండటం మరో వైపు కాంగ్రెస్ పార్టీ నుండి ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పు చేశానని భావించిన పొన్నం ప్రభాకర్.. ఈ సారి ఎంపీగా పోటీ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ ల నుంచి టఫ్ ఫైట్ ఉంటుందని పొన్నం అంచనా వేశారట. మరోవైపు పొన్నం ఎంపీగా పోటీ చేస్తేనే బాగుంటుందన్న చర్చ ఆయన అనుచరుల్లో కూడా జరుగుతోందట. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో సిరిసిల్ల నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఏడు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. అయితే రేవంత్ వర్గానికి ఆమడ దూరంలో ఉండే పొన్నం ప్రభాకర్ అనూహ్యంగా పాదయాత్రలో ముందుండటమే కాకుండా పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి మరీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారిందని ప్రచారం జరిగింది. కరీంనగర్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ పరిథిలోని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పొన్నం ప్రభాకర్ డైరెక్ట్ గా పార్లమెంట్ బరిలో దిగాలని నిర్ణయించుకున్నారట. 2009 తర్వాత 2014 లో బీఆర్ఎస్ 2019 లో బీజేపీకి అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను ఆదరిస్తారని అంచనాకు వచ్చిన పొన్నం కరీంనగర్ జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారు.

మొత్తానికి సిట్టింగ్ బీజేపీ ఎంపీని కాదని, బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను పక్కన పెట్టి.. పొన్నం ప్రభాకర్‌ను జనం ఆదరిస్తారా..? పొన్నం ప్రభాకర్‌కు కనీసం ఈ సారైనా కాలం కలిసి వస్తుందో లేదో వేచి చూడాల్సిందే

Tags

Read MoreRead Less
Next Story