గజపతినగరం టీడీపీ టికెట్ రేసులో ఆ ఇద్దరు

గజపతినగరం టీడీపీ టికెట్ రేసులో ఆ ఇద్దరు
ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పావులు కదుపుతోన్న నేతలు; మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కరణం శివ రామకృష్ణలు ఎత్తులకు పై ఎత్తులు

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ టీడీపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయట. ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఒక వైపు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఇంకో వైపు టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కరణం శివ రామకృష్ణలు పావులు కదుపుతున్నారట. వాస్తవానికి గడిచిన నాలుగేళ్లుగా మాజీ ఎమ్మెల్యే , నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీ కార్యక్రమాల్లో కొంచెం దూకుడు తగ్గించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నారనే భావనో లేక వేరే కారణమో తెలీదు కానీ కార్యక్రమాల్లో మాత్రం కొంత అలసత్వం వహిస్తున్నారనే చర్చ క్యాడర్ లో నడుస్తోంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని... ఉన్నా తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేపడతారని నియోజకవర్గం మొత్తం కోడై కూస్తోందట. తన తండ్రి కొండపల్లి పైడితల్లి నాయుడు పార్లమెంట్ సభ్యుడిగా పని చేయడం, తద్వారా నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు ఆయనకు కలిసొస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తన తండ్రి కొండపల్లి పైడితల్లి నాయుడు మీద ఉన్న అభిమానంతో అయినా టీడీపీ అధిష్టానం తనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన అనుచర వర్గంలో చర్చ జరుగుతోందట.

ఇకపోతే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న కరణం శివరామ కృష్ణ కూడా గజపతినగరం టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన మూడు పర్యాయాల పాటు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల నుండి పార్టీకి సేవలందిస్తున్న శివరామ కృష్ణ గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారి పోయిందట. పార్టీ పదవులు మినహా నామినేటెడ్ గాని అధికారపార్టీ పదవులు గాని దక్కకపోయినా ..మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. అధిష్ఠానం సూచనల మేరకు గజపతినగరం నియోజకవర్గంలో శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కొవిడ్ సమయంలో నియోజకవర్గం మొత్తం నిత్యావసర సరకుల పంపిణీ చేపట్టి ప్రజలకు అండగా నిలిచారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపడుతూ గ్రామ గ్రామాన పర్యటించారు. పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ నియోజకవర్గ టీడీపీలో తానేమీ తక్కువ కాదంటూ నిరూపించుకుంటున్నారట శివరామకృష్ణ. ఈ పరిణామాలన్నీ టికెట్ ఆశిస్తున్న కరణం శివరామ కృష్ణకు కలిసొచ్చే అంశాలుగా క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.

అయితే టీడీపీ టికెట్ రేసులో ఉన్న ఇరువురు నేతల ప్రయత్నాలు ఎలా ఉన్నా నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. అధికార పార్టీపై నెలకొన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ల్యాండ్ సెటిల్ మెంట్లు, అక్రమ ఇసుక రవాణాతో కాసులు దండుకుంటున్నట్లు నియోజకవర్గం వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవినీతిని ఎండగట్లాలని టీడీపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారట. మంత్రి తమ్ముడు ఉన్నా తమ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా గజపతినగరం టీడీపీ లో మాత్రం ఎలక్షన్ వేడి రాజుకుంది. అయితే టికెట్ రేసులో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలంటే ఎన్నికలవరకు వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story