వివేకా హత్యకేసు వైసీపీ మెడకు చుట్టుకుంటోందా?

వివేకా హత్యకేసు వైసీపీ మెడకు చుట్టుకుంటోందా?
ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోన్న వివేకా హత్యకేసు

వైఎస్ వివేకా హత్యకేసు ఉదంతం వైసీపీకి శాపంగా పరిణమించనుందా? ప్రజా వ్యతిరేక విధానాలతో పరపతి కోల్పోయిన వైసీపీ ఇంటి పోరుతో రచ్చకెక్కిందా? వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బలమైనా అధారాలు లభించాయా? వివేకా కుమార్తె చేస్తున్న పోరాటంతో హత్యకేసు నిందితులకు కఠిన శిక్షలు పడతాయా? విచారణ పూర్తయితే వైసీపీకి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందా?

ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోన్న వివేకా హత్యకేసు ఉదంతం.. వైసీపీకి శాపంగా పరిణమిస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రజల్లో పరపతి కోల్పోయిన వైసీపీ ఇంటి పోరుతో వీధికెక్కిందని టాక్ వినిపిస్తోంది. వివేకా దారుణ హత్యతో కుటుంబ సవాళ్లు రాష్ట్రం దాటేసి దేశ అత్యున్నత న్యాయస్థానాల వరకు వెళ్ళింది. హత్య కేసు నిందితులు ఎవరో తెలియాలన్న సునీత పట్టు ఒకవైపు, అధికార బలంతో కేసులో జగన్ జోక్యం చేసుకుని నీరుగారుస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబంలో చెలరేగిన రాజకీయ కార్చిచ్చు దేశ రాజకీయాల్లో వాడి వేడి చర్చలకు కేంద్ర బిందువుగా మారిందట. వివేకా హత్య కేసులో గుండెపోటు నుండి మొదలైన వైసీపీ డ్రామా గొడ్డలి పోటు, అక్రమ సంబంధాలు, ఆర్థిక అవకతవకలంటూ చేస్తున్న జగన్ బ్యాచ్ డ్రామా అసలు రక్తి కట్టలేదన్న ప్రచారం రాష్ట్ర, దేశ రాజకీయాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. కేసు నుండి ఎలాగైనా అవినాష్‌ను తప్పించాలన్న తపన జగన్‌లో ఉంటే.. ముమ్మాటికి నిందితులను వదిలేది లేదంటూ వివేకా కుమార్తె సునీత చేస్తున్న పోరాటం న్యాయ వ్యవస్థలకు పెద్ద ఛాలెంజ్‌గా మారిందని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు.

వివేక హత్య కేసులో అవినాష్ కోర్టు మెట్లెక్కిన ప్రతిసారీ సునీత కూడా ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేసును పారదర్శకంగా ముందుకు సాగనీయకుండా జగన్ ప్రభుత్వం పదేపదే మోకాలడ్డుకుతోందని సునీత నేరుగా ఇటు జగన్ పైన అటు వైసీపీ సర్కార్ పైన విరుచుకుపడుతున్నారు. కేసును పక్కదోవ పట్టించే క్రమంలో భాగంగా వివేకా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడంతో సునీత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట. వివేకా కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను, వివేక రెండో భార్య షమీం సంబంధాలను వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారట.

ఈ వ్యవహారం వైఎస్‌ కుటుంబంలోని మిగతా సభ్యులకు కూడా రుచించడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్యలో పాల్గొన్న, హత్య తో సంబంధమున్న దొండ్ల వాగు శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిల అరెస్టులో సీబీఐ దర్యాప్తు కంటే మొక్కవోని ధైర్యంతో సునీత చేసిన పోరాటమే ఎక్కువని టాక్ వినిపిస్తోంది. ఈ ఐదుగురి నిందితుల గుర్తింపు తర్వాత కేసు నెమ్మదించడం వీరి అరెస్టులతోనే ఈ కేసును క్లోజ్ చేస్తారనే జరిగిన ఊహగానాలకు సునీత చేస్తున్న పోరాటం తెరదించిందని సమాచారం. నిందితులు ఎవరో తేలాలని పట్టుబట్టి, సుప్రీంకోర్టు మెట్లెక్కి సీబీఐ దర్యాప్తును వేగిరం చేయడంలో సునీత విజయం సాధించారని ప్రచారం జరుగుతోంది. ఇటు కరుడుగట్టిన నేరస్తులు, అటు రాష్ట్ర ప్రభుత్వం తోనూ సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు, అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిల అరెస్టు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారాయి. మరోవైపు అవినాష్ అరెస్ట్ అనివార్యమంటూ సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారంతో వైసీపీకి ఏం చేయాలో పాలుపోవడంలేదట. అవినాష్ అరెస్టుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన, తెలంగాణ హైకోర్టు జోక్యం పై సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కేదాకా వెళ్లింది. ఇక కేసు ముగింపు దశకు వచ్చిందని అవినాష్ అరెస్టు తప్పదంటూ ఇటు రాజకీయ విశ్లేషకులు, అటు న్యాయ వ్యవస్థ నిపుణులు అంచనావేస్తున్నారు. దీంతో అవినాష్ అరెస్ట్ జరిగితే సునీత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపో లేదంటున్నారు రాజకీయ నిపుణులు.

మరోవైపు వివేకా హత్యకేసులో కుటుంబసభ్యుల పాత్ర ఉందని తేలడంతో జగన్ ఒంటరి వారవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర చేసి తను అధికారం చేపట్టడానికి ముఖ్యకారణమైన చెల్లెలు షర్మిల, తల్లి విజయలక్ష్మి జగన్‌కు దూరమయ్యారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టయితే ఆయనతో పాటు జగన్‌ రాజకీయ భవిష్యత్తు పెను ప్రమాదంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీని పరిణామాలు ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది

Tags

Read MoreRead Less
Next Story