ఉమ్మడి నల్లగొండ జిల్లా కారులో అసమ్మతి సెగలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా కారులో అసమ్మతి సెగలు
బీఆర్ఎస్ లో చాపకింద నీరులా వ్యాపిస్తోన్న అసమ్మతి....

ఆ ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన అత్మీయ సమ్మేళనాలు, నియోజకవర్గస్థాయి ప్లీనరీలలో.. చాపకింద నీరులా అసమ్మతి కొనసాగుతోందా? గులాబీ బాస్ పిలుపునిచ్చిన ఆత్మీయ సమ్మేళనాలకు, ప్లీనరీలకు అసమ్మతి నేతలు గైర్హాజరకు కారణాలేంటి? సగం అసెంబ్లీ సెగ్మెంట్లలో రెబెల్స్‌తో ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారా?


ఉమ్మడి నల్గగొండ జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి చాపకింద నీరులా వ్యాపిస్తోందట. నేతల మధ్య సఖ్యత లేక వర్గాలుగా విడిపోయారని టాక్ వినిపిస్తోంది. జిల్లాలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలతో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 సెగ్మెంట్లలో.. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నా.. ఆత్మీయ సమ్మేళనాలు, నియోజకవర్గ ప్లీనరీలకు అసమ్మతి నేతలు ఝలక్ ఇస్తున్నారట. పార్టీ ఆదేశాల ప్రకారం.. అందరూ హాజరు కావాల్సిన ఉన్నప్పటికీ.. అత్మీయ సమ్మేళనాలకు రెబెల్స్ డుమ్మా కొట్టడంతో పార్టీలో అంతర్గతపోరుపై చర్చ జరుగుతోందట. నల్లగొండ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్, కోదాడ, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లలో.. అసమ్మతి నేతలు దూరంగా ఉన్నారట. ఇతర పార్టీలనుంచి చేరికలు, అంతర్గత కుమ్ములాటలతో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలకు రెబెల్స్ నుంచి తలనొప్పిగా తయారయ్యాయట.

నల్లగొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగిన బీఆర్‌ఎస్‌ ప్లీనరీకి.. పలువురు కీలక నేతలు హాజరుకాలేదు. వీరిలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి తోపాటు.. ఆ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు, 8వ వార్డు కౌన్సిలర్‌ పిల్లి రామరాజు యాదవ్‌లు హాజరుకాలేదు. వీరిద్దరూ కొంత కాలంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తున్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నకిరేకల్‌ సెగ్మెంట్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్వహించిన అన్ని ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా పలువురు గులాబీ పార్టీ నాయకులు డుమ్మాకొట్టారు. మరోవైపు.. మాజీ MLA వీరేశం సైతం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారట. చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ లో గెలిచి గులాబీ పార్టీలోకి వచ్చినప్పటినుంచి వీరేశం తో పొసగడం లేదట. ఎవరికివారు తమ వ్యూహాలకు పదును పెడుతూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారట.

దేవరకొండ లో.. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అధ్యక్షతన జరిగిన పలు ఆత్మీయ సమ్మేళనాలకు.. డిండి జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, దేవరకొండ చైర్మన్ ఆలంపాట నరసింహ, మాజీ చైర్మన్ దేవేందర్ నాయక్ సహా పలు ఎంపీపీ, ఎంపీటీసీ వంటివారంతా గైర్హాజరయ్యారు. అంతేనా.. తిరుపతి, యాదగరిగుట్ట వంటి పుణ్యక్షేత్రాలకు దాదాపు నలబైమంది లీడర్లు వెల్లారట. వీరంతా.. MLA రవీంద్రకుమార్ ఒంటెద్దుపోకడలను వ్యతిరేకిస్తూ.. ఒకే గ్రూపుగా రాజకీయాలు చేస్తున్నారట. మరోవైపు.. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం ఆత్మీయ సమ్మళనాలు, ప్లీనరీ వంటవన్నీ.. ఎమ్మెల్యే నోముల భగత్‌ ఆధ్వర్యంలో హాలియాలో నిర్వహించారు. ఈ సమావేశాలకి ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి సహా పలువురు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ వంటివారంతా హాజరుకాలేదు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి జనగాం జిల్లా ఇన్‌చార్జి కాగా.. ఆయన ఆ కోణంలో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీంతో.. సాగర్ లో రెండు గ్రూపులుగా పార్టీ విడిపోయంది.

కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో.. గులాబీ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు సహా ప్లీనరీలకి పార్టీ సీనియర్‌ నేతలైన శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావు, మున్సిపల్ చైర్మన్ దంపతులు గైర్హాజరయ్యారు. వీరంతా.. సమావేశాల సమయంలో.. ప్రైవేటుగా సమావేశమైనట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మిగతా నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక.. మునుగోడు నియోజకవర్గంలోనూ.. తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలు సహా పార్టీ నియోజకవర్గ ప్లీనరీకి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, రాష్ట్ర నాయకులైన కర్నాటి విద్యాసాగర్‌, నారబోయిన రవి లాంటి నేతలు గైర్హాజరయ్యారు.

అయితే జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, ప్లీనరీలలో నేతల మధ్య అసమ్మతికి తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారట. ఇటీవల పలు మండలాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలలో అక్కడక్కాడా అసమ్మతి గళం వినిపించడంతో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని సదరు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చి బుజ్జగించినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకాని నేతలపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని క్యాడర్‌లో చర్చజరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story