దామోదర రాజనర్సింహ మౌనం వెనుక వ్యూహం ఏంటి..?

దామోదర రాజనర్సింహ మౌనం వెనుక వ్యూహం ఏంటి..?
ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చక్రం తిప్పిన ఉప ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన తరువాత పరిస్థితులు మారిపోయాయి

ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చక్రం తిప్పిన ఉప ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన తరువాత పరిస్థితులు మారిపోయాయి. రెండు సార్లు ఓటమి పాలు కావడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయన మౌనం వెనుక వ్యూహం ఏంటి..? రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే బుజ్జగించినా.. అలకపాన్పు ఎందుకు వీడలేదు? దామోదర మౌనం వెనుక స్కెచ్‌ ఏంటి

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా డిప్యూటీ సీఎంగా ఓ వెలుగు వెలిగారు దామోదర రాజనర్సింహ. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ ఎదురీదడంతో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. అయితే ఆయన మౌనం వెనుక పెద్ద స్కెచ్ ఉందని పలువురు అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయిన కొత్తలో కొంత యాక్టివ్‌గా కనిపించారు. ఆ తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాహుల్‌ జోడో యాత్రతో నియోజకవర్గంలోనూ మంచి జోష్‌ వచ్చింది. అయినా ఆ తరువాత ఆ ఊపు కొనసాగించలేకపోయారు. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉంటున్నారు రాజనర్శింహ. దీంతో ఆయన సతీమణి పద్మినితో కలిసి బీజేపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయినా... ఆ ఊహాగానాలను దామోదర ఖండించలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో దామోదర రాజనర్సింహ సోదరుడు రామచంద్ర రాజ నర్శింహ మాత్రం కమలం గూట్లో చేరిపోయారు. జహీరాబాద్‌ నియోజకవర్గంపై దృష్టి పెట్టి ఆయన పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది దామోదరకు కాస్తా ఇబ్బందికరంగానే మారిందని వదంతులు వినిపిస్తున్నాయి. 2018 ఎన్నికలకు ముందు దామోదర రాజనర్శింహ సతీమణి పద్మిని ఉదయం బిజెపిలో చేరి సాయంత్రానికి కాంగ్రెస్‌ గూటికి తిరిగి వచ్చేశారు. ఈ పరిణామం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో సీనియర్‌గా ఉన్న దామోదర మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకే కాదు... నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటున్నారట. శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. ఈ క్రమంలో దామోదర వ్యూహం ఏంటన్నది సొంత పార్టీ నాయకులకూ అంతు చిక్కడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు పార్టీకి దూరంగా ఉంటుండడంతో కార్యకర్తలు గందగగోళానికి గురవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల సంగారెడ్డిలో జగ్గారెడ్డి నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు దామోదర రాజనర్సింహ హాజరుకాలేదు. దీంతో ఇదే కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే దామోదర నివాసానికి వెళ్లి బుజ్జగించినట్లు సమాచారం. అయినా... దామోదర మౌనం వీడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకీ థాక్రే రాయబారం ఫలించలేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పార్టీ నాయకులు.

దామోదర రాజనర్సింహ మౌనం వెనుక వ్యూహం ఏమిటో ఎవరికీ అంతుబట్టడంలేదట. అయితే ఆయన పార్టీ వీడి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక రాజనర్సింహ పక్కచూపుల ప్రచారానికి చెక్‌ పెడతారో.. లేక నిజం చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. మరి రాబోయే రోజుల్లో ఈ మాజీ డిప్యూటీ సీఎం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story