పొలిటికల్ కెరీర్‌పై బెంగపెట్టుకున్న వైసీపీ నేతలు

పొలిటికల్ కెరీర్‌పై బెంగపెట్టుకున్న వైసీపీ నేతలు
ఆ జిల్లాలో అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయా.. నిన్న మొన్నటి వరకు అధిష్టానం వద్ద అన్నీ తానై నడిపిన ముఖ్య నేతే

ఆ జిల్లాలో అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయా.. నిన్న మొన్నటి వరకు అధిష్టానం వద్ద అన్నీ తానై నడిపిన ముఖ్య నేతే డిఫెన్స్‌లో పడటంతో మిగిలిన నేతలు ఆలోచనలో పడ్డారా. ఓ వైపు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లు,ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నేతల తిరుగుబాట్లు.. మరో వైపు ఐ ప్యాక్ టీం నివేదికలతో అధిష్టానం క్లాస్ లు.. ప్రజల్లో పని చేయని నవరత్నాల జపం.. ఎక్కడికెళ్లినా నిలదీతలు. ఈ నేపధ్యంలో తమ రాజకీయ భవిష్యత్తుపై ఎవరికి వారు పునరాలోచనలో పడ్డారా.. అటు అధిష్టానాన్ని మెప్పించలేక, ఇటు ప్రజా సమస్యలు పరిష్కరించలేక తర్జన భర్జన పడుతున్నారా?

ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతల పరిస్థితి వారికే అంతు చిక్కడం లేదు. వైనాట్ 175అని అధినేత అంటుంటే ప్రకాశంలో ఒక్కటైనా గెలవగలమా అనే ఆలోచన ప్రస్తుత సిట్టింగ్ తో పాటు వైసీపీ నియోజకవర్గాల ఇన్చార్జిని కలవరం పెడుతోంది. ఉమ్మడి ప్రకాశంలో ఇంతకాలం పెద్దదిక్కుగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్ధితే ఆగమ్యగోచరంగా మారటంతో మన పరిస్థితి ఏమిటనే డోలాయమానంలో నేతలు పడ్డారు. దీనికి తోడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో అసమ్మతి సెగలు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా దర్శి, గిద్దలూరు, కనిగిరి,అద్దంకి,పర్చూరు నియోజక వర్గాలలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నియోజకవర్గాలలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఇన్‌ఛార్జ్‌లపై ఇప్పటికే పుంఖాను పుంఖాలుగా అధిష్టానానికి సొంత పార్టీ వర్గీయుల నుంచే ఫిర్యాదులు అందాయట. మరో వైపు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన సంతనూతలపాడు, యర్రగొండపాలెం, కొండపిలో అసమ్మతినేతల రాజకీయాలు నేతలకు తల బొప్పి గట్టిస్తున్నాయి.ఓ వైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీకి ఎదురు గాలి వీస్తుండగా మరోవైపు అసమ్మతి గ్రూపులకు రాష్టృ స్ధాయి నేతల మద్దతు ఉంటుండటంతో నాయకుల పరిస్దితి ఆగమ్యగోచరంగా తయారైంది.

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిప్పటినుంచి సంక్షేమం పేరిట డబ్బులు పంచితే ఎప్పటికీ అధికారం తమదే అనే ధోరణి తమ కొంప ముంచనుందని అధికారపార్టీ నేతలు వాపోతున్నారు. సంక్షేమం కూడా అరకొరగా అందడం, అభివృద్ధి జాడలు ఎక్కడా లేకపోవడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలంటే ప్రజలు నిలదీస్తారనే భయం భయం నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోందట. సాహసించి ఎవరైన ప్రజల్లోకి వెళితే పరాభవం తప్పడం లేదు. ఉన్న పరిస్థితిని అధిష్టానం దృష్ఠికి తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే అధిష్టానం ఆగ్రహానికి గురవక తప్పదని ఎమ్మెల్యేలు వెనుకడుగు వేస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక అధినేత సమీప బంధువు బాలినేని శ్రీనివారసరెడ్డి సమన్వయ కర్త పదవికి రాజీనామా చేయడం పెను దుమారాన్నే రేపుతోంది. అధినేత బుజ్జగించినా ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గకపోవడంతో జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అధినేత బంధువుకే పార్టీలో దిక్కులేనపుడు తమ భవిష్యత్తు ఏంటన్న సందిగ్ధంలో పడిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే రాష్ట్రంలోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇన్చార్జ్‌లను వెంటాడుతోందట. ఈ పరిణామాలను గమనిస్తున్నకార్యకర్తలు పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నారు. దీంతో పార్టీని బతికించుకోలేక, ప్రజలు అడిగే సమ్యలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో అధికార పార్టీ నేతలు నలిగిపోతున్నట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story