ఖైరతాబాద్ బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట

ఖైరతాబాద్ బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట
X
ఖైరతాబాద్ బీఆర్ఎస్‌లో టికెట్ పోరు తీవ్రమయిందా? టికెట్ దక్కించుకునేందుకు సిట్టింగులతో పాటు ఆశావహులు పోటీ పడుతున్నారా? ఎవరికి వారు టికెట్ తమకే దక్కుతుందని ధీమాగా ఉన్నారా? అందుకే పోటీపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారా? మరి అధినేత మనసులో ఏముంది?

హైదరాబాద్‌లో కీలక నియోజకవర్గం ఖైరతాబాద్. సచివాలయం, రాజ్ భవన్ తో పాటు పలు ప్రధాన కార్యాలయాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే కొలువు దీరాయి. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఖైరతాబాద్ ప్రస్తుతం బీఆర్ఎస్‌కు కంచుకోట మారింది. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గెలిచి ....మంత్రి అయ్యారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక 2014 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతు తో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు.

ఒకప్పుడు ఖైరతాబాద్ అంటే పీజేఆర్, పీజేఆర్ అంటే ఖైరతాబాద్ అన్నంతగా నియోజకవర్గ ప్రజలతో పి జనార్దన్ రెడ్డి మమేకమయ్యారు. ఆయన మృతి తర్వాత ఖైరతాబాద్ లో దానం నాగేందర్ హవా కొనసాగుతూ వస్తోంది. 2009లో కాంగ్రెస్ నుంచి , 2018 లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఖైరతాబాద్ లో స్థానికుడైన దానం నాగేందర్ ....చిన్నప్పటి నుంచి మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పథకాల తో పాటు కరోనా సమయం లో పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. సిట్టింగ్ లకే టికెట్ అని కేసీఆర్ ప్రకటించడంతో ఈ సారి మళ్ళీ ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తానని దానం నాగేందర్ అంటున్నారు.

2001 నుంచి గులాబీ జెండాను నమ్ముకున్న నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి. బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత 2014 లో జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జిగా ఉన్న గోవర్దన్ రెడ్డి 2016 లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆరు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. వెంకటేశ్వర నగర్ కాలనీ కార్పొరేటర్ గా మన్నె గోవర్దన్ రెడ్డి భార్య మన్నె కవిత 2016 , 2020 లో రెండు సార్లు విజయం సాధించారు. మన్నె కవిత గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధిక మెజార్టీ సాధించిన కార్పొరేటర్‌గా రికార్డు సృష్టించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మన్నె గోవర్ధన్ రెడ్డి అసరా ఫౌండేషన్ ద్వారా పేదలకు విద్య తో పాటు వివాహ ఖర్చులు ఇస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారని పబ్లిక్ టాక్. పార్టీ పిలుపు మేరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి గోవర్దన్ రెడ్డి కృషి చేస్తున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న గోవర్దన్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, కవితలతో ఉన్న సాన్నిహిత్యంతో ఈ సారి ఖైరతాబాద్ టికెట్ నాదే అంటున్నారు మన్నె గోవర్ధన్ రెడ్డి.

కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ సహచరుడు. దాసోజు శ్రవణ్. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాటం చేసిన ఉద్యమకారుడు. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. టికెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ ....హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ జిల్లా లో బీఆర్ఎస్ఓ బలోపేతం కోసం కృషిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం పబ్లిక్‌లో ఉంటున్న దాసోజ్ శ్రవణ్‌కు ఈ సారి ఖైరతాబాద్ బీఆర్ఎస్ టికెట్ వస్తుందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.

ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్‌లో టికెట్ ఫైట్ మొదలయింది. సిట్టింగులతో పాటు పలువురు ఆశావహులు టికెట్ రేసులో ఉండటంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం అధిష్ఠానానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు టికెట్ దక్కించుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇక అధినేత టికెట్ ఎవరికి కేటాయిస్తారోనని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.

Tags

Next Story