ఉమ్మడి మహబూబ్ నగర్ బీఆర్ఎస్‌లో టికెట్ టెన్షన్

ఉమ్మడి మహబూబ్ నగర్ బీఆర్ఎస్‌లో టికెట్ టెన్షన్
X
అవినీతి ఎమ్మెల్యేల చిట్టా తనవద్ద ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఉమ్మడి మహబూబ్ నగర్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే తమ పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని టెన్షన్ పడుతున్నారా? సిట్టింగుల స్థానంలో పోటీచేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు పావులు కదుపుతున్నారా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సిట్టింగులకు ఆశావహులకు మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఇది అధికార బీఆర్ఎస్‌లో కాస్తంత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పలువురు ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్‌పై టెన్షన్ పడుతున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సారి తమకు టికెట్ వస్తుందో లేదోననే మీమాంసంలో పడినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల జాబితా భారీగానే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా పై టికెట్ ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలలో అభ్యర్దులను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

అచ్చంపేట నియోజకవర్గంలో గువ్వల బాలరాజు స్థానంలో ఎంపీ రాములు తనయుడు భరత్ ఆ స్థానాన్ని కోరుతున్నట్లు సమాచారం. అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహం ప్రజలకు దగ్గర కాలేకపోవడంతో సింగర్, రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ సాయిచంద్, మాజీ ఎంపీ మందా జగన్నాధం కొడుకు శ్రీనాథ్ సైతం టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. గద్వాల్ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డి కి సయోధ్య కుదరకపోవడంతో, గద్వాల్ జడ్‌పీ ఛైర్మన్ సరితకు ఈ సారి గద్వాల టికెట్ ఇప్పించేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం.

రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న షాద్ నగర్ అసెంబ్లీ విషయానికొస్తే అంజయ్య యాదవ్ పై ఆరోపణలు రావడంతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డివైపు అధినేత కేసిఆర్ మెుగ్గు చూపుతున్నట్లు సమాచారం. అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోకపోవడంతో జైపాల్ యాదవ్ స్థానంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ సారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డిపై ప్రజలు అసంతృప్తిగా ఉండటంతో జగన్నాథం రెడ్డి కూడ టికెట్ రేసులో ఉన్నారట. ఫార్మాలో పేరొందిన కంపెనీ యజమాని తనయుడు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. జడ్చర్ల నుంచి టికెట్ కావాలంటు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత్త ఎమ్మెల్యే మాజీమంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో చక్రం తిప్పేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో టికెట్ కన్ఫమ్ చేసుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అధినేత దృష్టిలో పడేందుకు శతవిధాలా ప్రయ్నతిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆశావహులు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో టికెట్ ఎవరిని వరిస్తుందోనని ప్రజల్లో చర్చ నడుస్తోంది.

Tags

Next Story