హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్...!

హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్...!


ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హుజురాబాద్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ సారి ఎలాగైనా హుజురాబాద్‌ను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్లు పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి విమర్శలు ప్రతివిమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. బీజేపీలో చేరిన ఈటలపై ఆధిపత్యం సాధించి రాబోయే ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలో ఈటలపై బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు కౌశిక్ రెడ్డి. అయితే కౌశిక్ రెడ్డి పేరు ఎత్తకుండానే తన దైనశైలిలో కౌంటర్లు వేస్తున్నారు ఈటల రాజేందర్. దీనిపై గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఓ వైపు ఈటల పై కౌశిక్ రెడ్డి తన రాజకీయ విమర్శల డోస్ పెంచుతూ వస్తున్నారు. ఈటల టార్గెట్‌గా పలు ఆరోపణలు చేస్తున్నా ఈటల మాత్రం పరోక్ష విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

కౌశిక్ రెడ్డి పేరు ఎత్తకుండా ఈటల విమర్శలకు దిగడం వెనుక పెద్ద స్కెచ్ ఉందనేది ఓపెన్ సీక్రేట్. కౌశిక్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలపై పదే పదే స్పందించడం కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థిగా కౌశిక్ రెడ్డి ని అంగీకరించినట్టవుతుందని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కౌశిక్ రెడ్డి మైలేజ్ పెంచినట్టవుతుందనే ఈటల అంచనావేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే కౌశిక్ పేరు ఎత్తకుండా కెసీఆర్ నే నేరుగా టార్గెట్ చేస్తున్నారట ఈటల.

రాష్ట్ర స్థాయి రాజకీయాలపై మాట్లాడటానికే ఈటల మక్కువ చూపిస్తున్నట్లు పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది. రాష్ట్ర మాజీ మంత్రిగా రాష్ట్ర స్థాయి నేతగా ఈటలకు ఇదంతా వర్కౌట్ అయినా .. రాజకీయాల్లో ఎదుగుతున్న కౌశిక్ రెడ్డికి మాత్రం ఈ పరిణామాలు అంతగా సెట్ అవడం లేదట. అందుకే తనని పరోక్షంగా విమర్శించినా ఈటల రాజేందర్ పై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత జరుగుతున్న పరిణామాలు.. వ్యూహాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించడంతో కౌశిక్ రెడ్డికి తన విమర్శలకు పదును పెడుతున్నారట. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ .. రాజకీయ విమర్శ ప్రతివిమర్శలు అనివార్యమే అయిన ఈ ఇరువురు నేతలు తమ వ్యూహాలకు ఎలా పదును పెడతారోనని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

ఈటలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా ఆయన మాత్రం తన పేరెత్తకుండా విమర్శలకు దిగుతుండటంతో కౌశిక్ రెడ్డి తన విమర్శలకు మరింత పదును పెట్టనున్నట్లు సమాచారం. ఈటలను వ్యక్తిగతంగా నైనా టార్గెట్ చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనికౌశిక్ రెడ్డి భావిస్తున్నారట. మరి ఈటల నోట కౌశిక్ రెడ్డి పేరు చెప్పించగలుగుతారా లేక ఈటల తన మార్క్ పాలిటిక్స్ తో ప్ర్యత్యర్ది పేరు ఎత్తకుండానే ఎన్నికలను ఎదుర్కొంటారా అన్నది వేచిచూడాల్సిందే

Read MoreRead Less
Next Story