ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిట్టింగ్‌లకు టికెట్ టెన్షన్ పట్టుకుందా...!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిట్టింగ్‌లకు టికెట్ టెన్షన్ పట్టుకుందా...!


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ టెన్షన్ పట్టుకుందా? అవినీతి ఎమ్మెల్యేల చిట్టా సిఎం వద్దకు చేరిందా? అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు ఉద్వాసన తప్పదా? సిట్టింగ్‌లకు దీటుగా ఆశావహులు పోటీ పడుతున్నారా?

ఈ ఏడాది చివర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ … ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సెగలు రేపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే… ఈసారి సిట్టింగ్‌లలో టిక్కెట్‌లు దక్కేది ఎవరికి? నో చెప్పేది ఎవరికన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.ఒక వైపు ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి … అసంతృప్త స్వరాలు పెరిగిన నేపథ్యంలో దీనికి కేసీఅర్ కామెంట్స్ తోడు కావడంతో సిట్టింగ్‌లు ఉక్కిరి బిక్కిరవుతున్నట్లు సమాచారం.

కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీలో సిట్టింగులు, ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పలు నియోజకవర్గాలలో సిట్టింగ్‌లకు, ఆశావహులకు మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిట్టింగ్‌లకు టికెట్ టెన్షన్ పట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలపై వస్తున్న ఆవినీతి ఆరోపణల నేపథ్యంలో సిట్టింగులను తప్పించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఎంతమందికి ఉద్వాసన పలుకుతారో తెలియక తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగులో ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించడంతో ఈ ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిట్టింగ్‌లకు టెన్షన్ పట్టుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సిట్టింగు సీట్లు పదిలమా.. కాదా.. అనే ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుండగా.. వీటిలో మూడు ఎస్టీ, రెండు ఎస్సీ రిజర్వుడు, మిగతా అయిదు స్థానాలు జనరల్ స్థానాలున్నాయి. 2018లో 9స్థానాలు బీఆర్ఎస్ విజయం సాధించగా ... ఆసిఫాబాద్ నుండి కాంగ్రెస్ తరపున గెలిచిన ఆత్రం సక్కు గులాబీ గూటికి చేరారు.. దీంతో ప్రస్తుతం 10 స్థానాలు కారు ఖాతాలో ఉండగా.. వీరందరి పనితీరును ఆధారంగా టికెట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పనితీరు బాగోలేని వారికి టికెట్లు ఇవ్వమని.. తీరు మార్చుకోవాలని సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది.

దాదాపు ఆరేడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సీఎం వద్ద రిపోర్టులు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పశ్చిమ జిల్లాలోని ఓ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ జిల్లాలోనే మరో సెగ్మెంటులో ఆవినీతి ద్వారా లభించిన సొమ్ముతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది. తూర్పు జిల్లాలో ఓ ఎమ్మెల్యే మొదటి నుంచి వివాదాల్లోనే చిక్కుకున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేలతో పాటు పలు సెగ్మెంట్లలో మండల స్థాయి నాయకులు కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి పూర్తి నివేదిక సీఎం వద్దకు చేరడంతో ఈసారి తమకు టికెట్ దక్కుతుందో లేదోనన్న ఆనుమానంతో ఆయా ఎమ్మెల్యేలు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

Read MoreRead Less
Next Story