మెదక్ బీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరిందా...?

మెదక్ బీఆర్ఎస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరిందా...?


మెదక్ బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందా ? సిట్టింగ్ ఎమ్మెల్యేకు దీటుగా మైనంపల్లి రోహిత్ రంగంలో దిగారా? ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ అనుచరుల మధ్య సోషల్ మీడియా లో వార్ నడుస్తోందా? ఇరు వర్గాలు పోలీస్‌ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారా? మెదక్ బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్‌లో మొన్నటి వరకు రెండు గ్రూపులు ఉండేవి.ప్రస్తుతం మైనంపల్లి రోహిత్ ఎంట్రీ తో రెండు గ్రూపులు కాస్తా మూడు గ్రూపులుగా మారాయి. అయితే ఎమ్మెల్యే పద్మారెడ్డి, మైనంపల్లి వర్గీయుల మధ్యే ప్రధాన పోటీగా నెలకొన్నట్లు నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి.. వరుసగా బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు . రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పుడా ఆ ఆశలకు గండి పడేలా కనిపిస్తోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు మైనంపల్లి రోహీత్‌ ఏంట్రీతో నియోజకవర్గంలో సీన్‌ మొత్తం మారిపోయిందని చర్చ జరుగుతోంది. రోహిత్‌ ఎంట్రీకి ముందే నియోజకవర్గంలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. న్నాయి. ఒకటి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వర్గం కాగా, మరొకటి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో మైనంపల్లి రోహిత్ ఎంట్రీ అయి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్‌ ఎంట్రీతో సీన్‌ మొత్తం రివర్సైంది. రెండు గ్రూపులు కాస్తా మూడు గ్రూపులవడంతో పోటీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్‌ మైనంపల్లి రోహిత్‌గా మారిపోయింది. మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ పేరుతో మెదక్ నియోజకవర్గంలో రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. మైనంపల్లి హన్మంతరావు గతంలో మెదక్‌ ఎమ్మెల్యేగా పని చేశారు. నియోజకవర్గ నేతలతో ఉన్న సంబంధాలు రోహిత్‌కు అనుకూలంగా మారనున్నట్లు సమాచారం. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ చోటు నెలకొంది. సోషల్‌ మీడియా వేదికగానూ ఎమ్మెల్యే, మైనంపల్లి వర్గీయుల మధ్య వార్‌ సాగుతోంది. తమను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు.

అయితే మైనంపల్లి రోహిత్‌కు బీఆర్ఎస్ అధిష్టానం పరోక్షంగా మద్దతిస్తుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే... దీనికి చెక్‌ పెట్టేందుకు పద్మాదేవేందర్‌రెడ్డి వర్గం యత్నిస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. ఎమ్మెల్యే భర్త దేవేందర్‌రెడ్డి బీజేపీతో టచ్‌లోకి వెళ్లారన్న వార్తలు వినిపించాయి. ఆ లీక్‌లు ఎమ్మెల్యే వర్గమే ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. దీని వల్ల ఒక్కదెబ్బకు రెండు పిట్టలు పడతాయని ఎమ్మెల్యే వర్గం భావిస్తోందట. అయితే... ఆ పరిస్థితి ఏమీ కనిపించకపోవడంతో మైనంపల్లి రోహిత్ వర్గం జోరు మాత్రం నియోజకవర్గంలో తగ్గడంలేదు. ఎమ్మెల్యే వర్గానికి చెక్‌ పెట్టేందుకు సేవా కార్యక్రమాలతో దూసుకెళుతున్నారు మైనంపల్లి రోహిత్‌.

నియోజకవర్గంలో మూడు వర్గాలుగా ఉన్న వర్గ పోరు నుండి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గం దాదాపు పక్కకు తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక పోలీస్‌ స్టేషన్‌ వరకూ చేరిన మైనంపల్లి, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ఎలా చెక్‌ పెడుతుందో వేచి చూడాలి.

Read MoreRead Less
Next Story