పవర్‌లెస్ పొలిటీషియన్‌గా ఏపీ మినిష్టర్

పవర్‌లెస్ పొలిటీషియన్‌గా ఏపీ మినిష్టర్


ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయ నేపథ్యం ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద కీలక శాఖలు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం. అదంతా గత చరిత్ర..కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో సదరు మంత్రికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయట. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన నేత ఇపుడు మంత్రిగా ఉన్నా నామమాత్రంగా మారారు?ఇంతకీ ఎవరా నాయకుడు?

రాజకీయాల్లో నేతల తలరాతలు అనూహ్యంగా మారిపోతుంటాయి. కొంతమంది నేతలు అధికారంలో ఉన్నా లేకున్నా హవా నడిపిస్తుంటారు. మరికొంత మంది అధికారంలో ఉన్నపుడు మాత్రమే పంతం నెగ్గించుకుంటూ పెత్తనం చెలాయిస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా అధికారంలో ఉన్నా అవమానాల పాలవుతూ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు పలువురు సీనియర్లు. ఏపీలో అధికార వైసీపీలో ఒకప్పుడు అంతాతానై వ్యవహరించిన మంత్రులు సైతం నేడు మౌనంగా విధులకే పరిమితం కావాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జగన్ క్యాబినెట్ లో కొంతమంది మంత్రులు విచిత్ర పరిస్ధితిని ఎదుర్కొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్నికల టీం అంటూ మంత్రి పదవులు ఇచ్చినా, పవర్ లేని పొలిటీషియన్లుగానే మిగిలిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురు సీనియర్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. తమకు జరుగుతున్న అవమానాలను కక్కలేక మింగలేక సతమతమౌతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలు సైతం ఇపుడు నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తోంది...

ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా ఉన్నత పదవులు నిర్వహించిన అనుభవం ఆయన సొంతం. కానీ ఇపుడు ఆయన అధికార పార్టీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. రెండవ విడత క్యాబినెట్ విస్తరణలో ప్రసాదరావును జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకోవడంతో ధర్మానకు పూర్వవైభవం ఖాయమని అంతా భావించారు. కాంగ్రెస్‌లో ఉన్నపుడు జిల్లాలో ధర్మాన మాటే శాసనంగా నడిచేది. జిల్లాలో ఉన్న విస్తృత పరిచయాలు, రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా పేరున్న ప్రసాదరావు అప్పట్లో పనిచేసిన ముఖ్యమంత్రులకు తలలో నాలుకలా ఉండేవారు. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్మాన మార్కు రాజకీయం కనిపించేది.


ఇదిలా ఉంటే ధర్మాన కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన తర్వాత ఆయన రాజకీయ ప్రాభవం క్రమంగా తగ్గుతోందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. గతంలో జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన పరిస్ధితి వైసీపీ ప్రభుత్వంలో మాత్రం కూరలో కరివేపాకు మాదిరిగా మారిపోయిందని చర్చ జరుగుతోంది. మంత్రి పదవి దక్కిందే కానీ ప్రసాదరావుకు హైకమాండ్ ఫ్రీహ్యాండ్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీనియర్ మంత్రిగా ఉన్న ప్రసాదరావు సేవలను తగిన విధంగా సీఎం జగన్ వినియోగించుకోవడం లేదనే భావన సిక్కోలు అధికార పార్టీలో వ్యక్తమౌతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో సిఎం జగన్ పర్యటించారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు శంకుస్ధాపన కార్యక్రమంలో ధర్మానకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి పోర్టు నిర్మాణానికి మూలపేట, విష్ణుచక్రం నిర్వాసితులకు నచ్చజెప్పటంలో ధర్మాన కీలకంగా వ్యవహరించారు. పరిహారం పెంపుతో పాటు భావనపాడు పోర్టును మూలపేట పోర్టుగా నామకరణం చేయటంలో ఆయన కృషిచేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ సీఎం సభలో ధర్మానకు కనీసం మాట్లాడే అవకాశం కల్పించకపోవటం చర్చకు దారితీసింది.

ఒకానొక సమయంలో అసలు మూలపేటలో పోర్టు శంకుస్ధాపన సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రాణాలు పోయినా పోర్టు నిర్మాణం సాగనివ్వమంటూ నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.కానీ మంత్రి ధర్మాన తన చాణక్యంతో నచ్చజెప్పడంతో నిర్వాసితులు శాంతించినట్లు సమాచారం. పోర్టు కోసం ఇంతటి గ్రౌండ్ వర్క్ చేసిన మంత్రి ధర్మానను కాదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం ధర్మాన అభిమానులకు మింగుడుపడటం లేదని పార్టీలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలో భవిష్యత్ రాజకీయాలపై మంత్రి ధర్మాన ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.

Read MoreRead Less
Next Story