ఆయనొస్తే లైన్ క్లియరేనా...?

ఆయనొస్తే లైన్ క్లియరేనా...?


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోందా అందుకే మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారా కేటీఆర్ పర్యటన కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారా

ఆయనొస్తే తమ అభర్థిత్వానికి లైన్ క్లియర్‌ అయినట్లేనా?

తెలంగాణ రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. ఇక.. అభ్యర్థుల విషయంలో ఒకడుగు ముందుకేసిన అధికార బీఆర్ఎస్.. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాలకు ఏకంగా క్యాండేట్లను ప్రకటించేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఈమధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణం పేరుతో జరుగుతున్న సమావేశాలతో పాటు ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొంటున్నారు. ప్రతీరోజు ఒకటి లేదా రెండు నియోజకవర్గాలలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకోసం సమాయత్తం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ వచ్చే ఎన్నికల్లో ఓట్లు.. సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అభ్యర్థుల ఖరారుతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే పనిలో పడినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల గెలుపు ఖాయమంటూ పరోక్షంగా అభ్యర్థులు వారేనన్న సంకేతాలు ఇచ్చారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, స్టేషన్ ఘనపురం, హుజురాబాద్, హుస్నాబాద్, హన్మకొండ నియోజకవర్గాలలో పర్యటించిన కేటీఆర్ కార్యకర్తలను ఉత్తేజపర్చడంతోపాటు ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. స్టేషన్ ఘన్‌పూర్ మినహా మిగతా నాలుగు నియోజకవర్గాలలో రాబోయే ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్ధులను ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించినట్లు ప్రచారం జరుగుతోంది. భూపాలపల్లిలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారికి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్రను రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారీటితో గెలిపించాలని బహిరంగ సభలోనే ప్రకటించారు. ఇటు ఘన్‌పూర్‌లో ఇద్దరు మాజీ డిప్యుటీ సీఎంలైన కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యలు ఎవరికి వారే నేనే అభ్యర్థినంటూ ప్రకటించుకోవడంతో క్యాడర్‌లో అయోమయం నెలకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. బహిరంగ సభలో పాల్గొన్న కెటీఆర్ఎ మాత్రం టికెట్ పై ఆచి తూచి వ్యవహరిస్తూ అభ్యర్ధి ఎవరనే అనే విషయం మాత్రం ప్రకటించకుండానే సభ ముగించారు.

ఇక హన్మకొండ హుస్నాబాద్ , హుజురాబాద్ నియోజకవర్గాలలో జరిగిన సభల్లో పాల్గొన్న కేటీఆర్ఎ హుజురాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డికి పట్టం కట్టాలని పిలుపునివ్వగా, హుస్నాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే వి.సతీష్‌ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను గతంలో కంటే డబుల్ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ వినయ్ భాస్కర్ అభ్యర్ధిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బీఆర్ఎస్‌లో జరుగుతున్న ఈ తంతును గమనిస్తూ తమ అభ్యర్థిత్వంపై అనుమానంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేటీఆర్ పర్యటన ఏర్పాటు చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని కేటీఆర్ పర్యటనను ఖరారు చేసుకుని అభ్యర్థిగా ప్రకటింపచేసుకుంటే ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చనే ఆలోచనలో ఆయా ఎమ్మెల్యేలు ఉన్నట్లు పబ్లిక్‌లో టాక్ తెలుస్తోంది.

Read MoreRead Less
Next Story