బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రాజెక్ట్ పాలిటిక్స్..?

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రాజెక్ట్ పాలిటిక్స్..?


ఉదయసముద్రం ప్రాజెక్ట్ ఘనత అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాదంటే మాదంటున్నాయా?రాబోయే ఎన్నికల్లో ప్రాజెక్ట్‌ను బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నాయా? ఎన్నికల్లో లబ్ది పొందేందుకు అధికార, విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయా? ఉదయసముద్రంలో రాజకీయ మథనం జరుగుతోందా ?

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో శ్రీశైలం సొరంగం ప్రాజెక్టు-SLBC లో భాగమైన.. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు పూర్తై.. ఇటీవలే ట్రయల్ రన్ సైతం పూర్తిచేసుకుంది. ఆ క్రమంలో.. ప్రాజెక్ట్ ఘనత మాదంటే మాదేనంటూ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలకు దిగుతుండడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో.. ఉదయసముద్రం ప్రాజెక్టు రీడిజైన్ చేసి.. అంచనావయాన్ని సవరించడంతో 700 కోట్లకు చేరింది. ఇటీవల ఉదయ సముద్రం ప్రాజెక్టుకు చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైంది.

ఇటీవల ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో.. ఆ ఘనత మాదంటే మాదేనంటూ.. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఎవరికివారు క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలావుంటే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. బ్రాహ్మణవెల్లంల-ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారంతా.. ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత తమదంటే.. తమది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఉదయసముద్రం ప్రాజెక్టు ట్రయల్ రన్ దృశ్యాలు, వీడియోలతో సోషల్ మీడియా వేదికగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాల మధ్య సాగుతున్న పోటాపోటీ ప్రచారం.. నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం సహా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఉదయసముద్రం ప్రాజెక్టు క్రెడిట్ కోసం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రచారయుద్ధం రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటోంది.

ప్రాజెక్ట్ ట్రయల్ రన్ మొదటి రోజున.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు నిర్వహించి.. కృష్ణా జలాలకు హారతి పట్టి, పూజలు చేశారు. ఆ సమయంలో.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రస్తావించిన అంశాల నేపధ్యంలో.. కౌంటర్ గా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాత్రం.. ఉదయ సముద్రం ప్రాజెక్టు సహా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని.. అందులో భాగంగానే పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి పదేపదే తీసుకెళ్లడంతో.. పనులు పూర్తయ్యేందుకు నిధులు, ఆదేశాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీనికి పోటీగా.. ఎంపీ కోమటిరెడ్డి అనుచరుడు.. నకిరేకల్ కాంగ్రెస్ నేత దైద రవీందర్ కృష్ణా జలాలకు పూజలు చేసి, ఎంపీ కోమటిరెడ్డి ఫ్లెక్సీలకు పాలు, పూలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ ఘనత దివంగత వైఎస్ఆర్ ప్రభుత్వానికి, ఆనాటి మంత్రి, ప్రస్తుత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేనన్నారు. ఇదిలాఉంటే.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు సైతం.. 2014 నుంచి 2018 మధ్య కాలంలో.. ప్రాజెక్ట్ రీ డిజైన్ సహా.. పెండింగ్ బిల్లుల మంజూరు, పనులను వేగవంతం చేయడం, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి లతో ప్రాజెక్టును గాడిలో పెట్టిన ఘనత తమ నాయకుడు వేముల వీరేశందేనంటూ.. ఆనాటి ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హోరెత్తించారు.

అధికార గులాబీ పార్టీలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ప్రాజెక్ట్ ఘనతపై క్రెడిట్ మాదేనంటూ ఎవరికి వారు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఉదయం సముద్రం ప్రాజెక్టు నేపథ్యంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పేరుతో జరుగుతున్న ప్రచార హోరులో.. ఎవరికివారు తగ్గేదేలే అంటూ ప్రాజెక్టు దగ్గర ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక.. నకిరేకల్, మునుగోడు, నల్లగొండ, తుంగతుర్తి, నియోజకవర్గాల పరిధిలో.. దాదాపు లక్ష ఎకరాలకు సాగునీటితోపాటు.. 117 గ్రామాల వరకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమైందని.. 2018 పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్.. 2023 వరకు సాగదీశారని.. ఎట్టకేలకు ఎన్నికల ముందు ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించడం హర్షనీయo అని హస్తం పార్టీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ ఘనతలు మావేనని, వైఫల్యాలు మీవే అంటూ పరస్పరం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేసుకొంటున్న ఆరోపణలు జిల్లా రైతాంగంలో, ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.

Read MoreRead Less
Next Story