మంత్రి కాకాణి భవిష్యత్తును ముందే ఊహించి సైలెంట్ అయ్యారా?

మంత్రి కాకాణి భవిష్యత్తును ముందే ఊహించి సైలెంట్ అయ్యారా?
మంత్రి కాకాణి అపకీర్తి మూటగట్టుకున్నారా? మంత్రిగా కాకాణి బాధ్యతలు తీసుకున్న తరువాత జిల్లాలో పరిస్థితులు తారుమారయ్యాయా? కాకాణి మంత్రి అయ్యాక పటిష్టంగా ఉన్న పార్టీ పతనమైందా? మంత్రిగా జిల్లాను నడిపించాల్సిన కాకాణి విఫలమయ్యారా? రాష్ట్రానికి మంత్రి అయినా కేవలం సర్వేపల్లికే పరిమితం అయ్యారా? అసలు కాకాణికి ఎందుకీ అప్రదిష్ఠ?

నెల్లూరు వైసీపీలో పుట్టిన ముసలంతో అపార్టీ అప్రదిష్ట పాలవుతోందని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలున్నా వైసీపీ ప్రతిపక్షంలో కంటే అధికారం చేపట్టాక భయం మొదలైందట. 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నపుడు అంతా ఒక్కతాటిపై నిలిచిన ఎమ్మెల్యేలు అధికారం చేపట్టాక పదిమంది ఎమ్మెల్యేలున్నా తలో దారి ఎంచుకోవడంతో వైసీపీలో భయం మొదలైందట. జగన్మోహన్ రెడ్డి పాలనపై జిల్లాలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ముందుగానే పసిగట్టిన సీనియర్ ఎమ్మేల్యేలు ప్రభుత్వ పాలనను మార్చుకోవాలని సూచించారట. అయితే ఎమ్మెల్యేల సూచనలను పట్టించుకోకపోవడమే కాకుండా వారిని పక్కనపెట్టడంతో ముగ్గురు సీనియర్లు పార్టీ నుండి బయటకు వచ్చేశారు. అయితే ముఖ్యంగా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కతాటిపై నడిపించడంలో జగన్ విఫలమయ్యారని చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలొ ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడుగా అందరిని ఏకతాటి పై నడిపించిన కాకణి గోవర్దన్ రెడ్డి.. మంత్రి అయిన తరువాత ముఖం చాటేశారన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

2014 ఎన్నికల తరవాత ప్రతిపక్షంలో ఉన్న వైసీపికి నెల్లూరు జిల్లాలో ఆరు మంది ఎమ్మేల్యేలు, జడ్పీ ఛైర్మన్, నెల్లూరు కార్పోరేషన్, జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్పప్పటికి నాయకుల్లో ఏ మాత్రం పొరపొచ్చాలు రాకుండా ఏకతాటి పై నడిపించారు అప్పటి జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కాకాణి. అయితే ఇప్పుడు మంత్రిగా అంతకు మించి బాధ్యత ఉంది. అయితే జిల్లాలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే మంత్రి సహకారం తప్పనిసరి. తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి కోసమైనా మంత్రి మాట వినాల్సిన ఎమ్మెల్యేలు అసలు లెక్కచేయడంలేదని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేలను ఏకతాటి పైకి తీసుకురావడంలో విఫలమయ్యారనే అపవాదును మంత్రి కాకాణి మూటకట్టుకున్నారట. మంత్రి వ్యవహారశైలివల్లే పార్టీలో విభేదాలు పొడచూపాయని జిల్లాలో చర్చ నడుస్తోంది.

జిల్లా వైసీపీలో విభేదాలతో ద్వితీయ శ్రేణి నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇది చాలదన్నట్టు కాకణి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లాలో ఎమ్మేల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు ఎమ్మేల్యేలకు ద్వితీయ శ్రేణి నేతల మధ్య పూడ్చలేనంతగా గ్యాప్ పెరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు సెకండ్ క్యాడర్ నేతలపై నమ్మకం సన్నగిల్లడంతో ప్రక్కన పెడుతున్నారట. వీరిని సమన్వయం చేయాల్సిన మంత్రి కాకణి ఫెయిల్యూర్ అయ్యారని అధిష్టానం భావిస్తోందని టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తె పక్క నియోజక వర్గ ఎమ్మెల్యే ఏమనుకుంటాడోనని కాకాణి భావిస్తున్నారు. దీంతో వీలు దొరికినప్పుడాల్లా తను ప్రాతినిథ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించుకుంటూ మిగిలిన సమయంలొ పని ఉన్న లేకున్నా అమరావతిలో మకాం వేస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే మంత్రిగా అమరావతిలో బిజీగా ఉన్నానని చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే దీనికంతటికి బలమైన కారణం ఉందన్నది కాకణి ముఖ్య అనుచరుల వాదన. గత పద్దెనిమిది ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న కాకణి.. ఒకసారి జడ్పీ ఛైర్మన్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. రాజకీయ పరిణామాలను ముందుగా అంచనా వేయగల కాకాణి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలను ముందే ఊహించి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజల్లో వైసీపి ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటం. రాబోయే ఎన్నికల్లో పరిణామాలు పూర్తిగా తారుమారు కానున్నట్టు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై పెద్దగా దృష్టి సారించలేదని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల మధ్య చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటలపై వైసీపీ అధిష్ఠానం ఎలాంటి చర్యలకు తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి.

Tags

Read MoreRead Less
Next Story