స్పీకర్ పోచారం సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తారా...!

స్పీకర్ పోచారం సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తారా...!
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ కెరీర్ పై ఊగిసలాట

స్పీకర్‌లు ఓడిపోతారనే సెంటి మెంట్ ఉంది. చాలా ఎన్నికల్లో ఇది రుజువైంది కూడా. దీంతో తెలంగాణలో ఇపుడు అందరి దృష్టి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై పడింది. వచ్చే ఎన్నికల్లో పోచారం పోటీ చేస్తారా? తప్పుకుంటారా? ఆయన స్థానంలో పోటీ చేసేదెవరు? ఒక వేళ పోచారం తప్పుకుంటే ఇక పొలిటికల్ రిటైర్ మెంటేనా? పోటీ చేసి ఓడితే పరిస్థితి ఏంటి? గెలిస్తే రాజకీయ భవిష్యత్తేంటి ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ కెరీర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఐదేళ్ల పాటు సభను విజయవంతంగా నడిపించారు. గతంలో రెండు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది.రెండో సారి కూడా కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన పోచారంకు స్పీకర్ పదవి వరించడంతో కొంత అసంతృప్తి ఉన్నా కాదన లేకపోయారట. ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నుంచి ప్రతినిథ్యం వహిస్తున్న పోచారం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటారా? ఉండరా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఆరోగ్య కారణాలతో పొలిటికల్ రిటైర్ మెంట్ ప్రకటిస్తారని గతంలో జోరుగా ప్రచారం జరిగింది.

రాబోయే ఎన్నికల్లో తను పోటీ చేస్తానని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అంటున్నారట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. పైకి అలా చెబుతున్నా మరో వైపు పోటీకి సెంటి మెంట్ కూడా అడ్డొస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అసెంబ్లీ స్పీకర్‌లుగా పని చేసిన వారెవరు గెలువకపోవడంతో ఆ సెంట్‌మెంట్ పనిచేస్తుందని పోచారం టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. అయితే ఈ రికార్డును బ్రేక్ చేస్తానంటున్నారట పోచారం.ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతోందంటూ పదే పదే చెబుతోన్న స్పీకర్ తన సొంత నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారట. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని స్పీకర్ గా పనిచేసిన వారు కూడా గెలువొచ్చని నిరూపిస్తానని ప్రతిన బూనినట్లు నియోజవర్గ ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే చివరి నిమిషంలో తప్పుకుని తనయుడు భాస్కర్ రెడ్డిని బరిలో దింపేందుకు స్పీకర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు పోచారం పోటీ చేసి గెలిచిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ రాజీనామా చేసి తనయుడు భాస్కర్ రెడ్డికి అవకాశం ఇస్తారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ పోచారం గెలిస్తే మళ్ళీ రెండో సారి స్పీకర్‌గా అవకాశం ఇస్తారా లేదా క్యాబినెట్ లోకి తీసు కుంటారా అనేదానిపై కూడా రకరకాల ఊహా గానాలు చక్కర్లు కొడుతున్నాయి.

మొత్తానికి స్పీకర్ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పీకర్‌కు ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అవి తమకు కలిసొస్తాయని నమ్ముకున్న ప్రతిపక్ష పార్టీ లు మాత్రం బాన్సువాడపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్పీకర్ సెంటిమెంట్ రికార్డును పోచారం బ్రేక్ చేస్తారా లేదా అదే సెంటిమెంటు పనిచేస్తుందా తెలియాలంటే ఎన్నికలదాకా ఆగాల్సిందే..

Tags

Read MoreRead Less
Next Story