జమ్మలమడుగు వైసీపీలో జగడం వెనుక ఉన్న ఆజ్ఞాత వ్యక్తి ఎవరు..?

జమ్మలమడుగు వైసీపీలో జగడం వెనుక ఉన్న ఆజ్ఞాత వ్యక్తి ఎవరు..?

ఫ్యాక్షన్ కి పొలిటికల్ యాక్షన్ కలగలిపి నెత్తుటి మడుగులు పారిన ప్రాంతమది? ఓ వైపు గ్రూపు తగాదాలు మరోవైపు అవినీతి అక్రమాలతో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఈసారి సీటు గండం తప్పదా? పేషెంట్ నాడిని తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే ఓటర్ నాడిని పట్టలేకపోతున్నారా? జమ్మలమడుగు వైసీపీలో ముదురుతున్న జగడాల వెనక ఉన్నదెవరు?

సీమ ఫ్యాక్షన్ చరిత్రకు చిరునామా జమ్మలమడుగు. దశాబ్దల ఫ్యాక్షన్ పోరు సలిపిన దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాలను రాజకీయంగా దెబ్బేసి జమ్మలమడుగు జమానాను వైయస్ జగన్ సొంతం చేసుకున్నారు. డాక్టర్‌గా సేవలందిస్తున్న సుధీర్ రెడ్డిని రాజకీయాలకు పరిచయం చేయడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యేనే చేశారు. ఇటు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల ఉమ్మడి ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన సుధీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఆనందం ఎంతో కాలం నిలవలేదని తెగ బాధపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీలో అసమ్మతి నాయకులతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వేగలేకపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు.

మట్టి తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాలో పర్సంటేజ్ లతో నాయకులను ఒక్కటిగా చేసి వైసీపీ మహిళా నాయకురాలు అల్లె ప్రభావతి, గంగవరం శేఖర్ రెడ్డి లాంటి వారు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహించి సుధీర్ రెడ్డి పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ తిరుగుబాటు రాజకీయం కాస్తా శృతిమించి భౌతిక దాడులు, హత్యయత్నాల వరకు వెళ్ళింది. చిన్న కొమెర్లలో రామ సుబ్బారెడ్డి వర్గంపై మట్టి అక్రమ తవ్వకాల్లో పొడచూపిన రాజకీయ ఆధిపత్యం సొంత పార్టీలోనే అసమతి వర్గాన్ని మట్టు పెట్టేంత వరకు వెళ్లినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే గత వారం ఎమ్మెల్యే సొంత మండలంలోని వైకోడూరులో ఇటు వైసీపీ అసమ్మతి నేత శేఖర్ రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు పరస్పరం భౌతిక దాడులకు దిగి పచ్చని పల్లెలో బీభత్సాన్ని సృష్టించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాక పెద్దముడియం మండలం రాజోలి ప్రాజెక్టు విషయం సాక్షాత్తు ఎమ్మెల్యే రైతులపై పరుష పదజాలంతో దుర్భాషలాడటంతో కడప కలెక్టర్ కార్యాలయంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఇక ముద్దనూరు మండలంలో ముందు నుంచి రామసుబ్బారెడ్డి వర్గంలో రాజకీయ జీవితాన్ని కొనసాగించి ఆఖరున వైసీపీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే మేనమామ ముని రాజారెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడంతో నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మైలవరం మండలంలో తన బావమరిది దోడియం విష్ణు మండల రాజకీయాలను తన గుప్పిట్లో ఒడిసిపట్టి కనుసైగలతో నడపడం, సోలార్ భూముల వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా శేఖర్ రెడ్డి, పల్లె ప్రభావతి వర్గానికి అస్సలు నచ్చటం లేదని సమాచారం. ఈ క్రమంలో వీరందరినీ ఓ అదృశ్య శక్తి నడిపిస్తోందన్న ప్రచారమూ జోరుగా జరుగుతోంది. జగన్‌కు రాజకీయ సన్నిహితుడు, జమ్మలమడుగు సీటు ఆశిస్తున్న ఓ వ్యక్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గాన్ని ఉసిగొల్పుతున్నాడని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. మరోవైపు మొదటి నుంచి వైసీపీని నమ్ముకుని పార్టీ జెండా మోసి అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలు ఎమ్మెల్యే వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారట. ఇలా సొంత పార్టీలో అసమ్మతి వర్గం మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి తో ఆధిపత్య పోరు రెండు కలగలిపి కలహాలతో నెట్టుకొస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముచ్చటగా మూడో శత్రువును ఈసారి ఎదుర్కోవటం అంత తేలిక కాదన్న ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. ఆదినారాయణ రెడ్డి కుటుంబంలో తన అన్న కుమారుడు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అయిన భూపేష్ రెడ్డి చురుగ్గా వ్యవహరిస్తూ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఈ కుటుంబానికి ఉన్న పట్టుతో ఈ సారి వైసీపీ ఓటు బ్యాంకుకు టీడీపీ కొల్లగొడుతుందని చర్చ నడుస్తోంది.

వైసీపీలోని అధిపత్య పోరు, రామసుబ్బారెడ్డి వర్గీయుల నుంచి ఎదురవుతున్న రాజకీయ నిరాదరణ టీడీపీ నుంచి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లతో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతమతమవుతున్నట్లు సమాచారం. దీంతో జమ్మలమడుగు రాజకీయాల్లో బలహీనమైన సుధీర్ రెడ్డిని బలవంతంగా తప్పించేందుకు వ్యూహం పన్నుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి జమ్మలమడుగు వైసీపీలో అసమ్మతి పై అధిష్ఠానం ఏ చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

Tags

Read MoreRead Less
Next Story