పొంగులేటితో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ అసంతృప్త నేతలు వీరేనా?

పొంగులేటితో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ అసంతృప్త నేతలు వీరేనా?


ఆ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ అసంతృప్తి నేతలంతా.. పొంగులేటి వెంట నడుస్తారా? బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఓ నియోజకవర్గ నేత పొంగులేటితో సంప్రదింపులు జరిపారా? బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఆయనతో టచ్ లోకి వెళుతున్నారా? తాజాగా జిల్లా మీదుగా వెళుతున్న పొంగులేటికి బీఆర్ఎస్ క్యాడర్ స్వాగతం పలకడం వెనక ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు..? ఆ ఉమ్మడి జిల్లాలో పొంగులేటి వెంట నడిచే అసంతృప్త గులాబీలు ఎవరు?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార బీఆర్ఎస్‌తో ప్రధాన పార్టీలలు ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసంతృప్త బీఆర్ఎస్ నేతలంతా.. అధిష్టానం మీద, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో జిల్లాలోని అసమ్మతి నేతలంతా ఏకమై బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపినట్లు జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి నాయకులతోపాటు.. కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఇద్దరు నియోజకవర్గ నేతలు సైతం ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటితో సమావేశం కావడంపై సర్వత్రా చర్చ నీయాంశమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనతోకల్సి వస్తే.. సదరు నాయకులకు అన్ని తానై వెనక ఉండి నడిపిస్తానని పొంగులేటి హామీ ఇచ్చారనే ప్రచారం జోరందుకుంది.

అయితే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతవరకు ఏ పార్టీలో చేరతారనే దానిపై తుది నిర్ణయం ప్రకటించలేదు. కొత్త పార్టీ పెడతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈటల రాజేందర్‌తో సమావేశం జరిగిన టైమ్ లో.. బీజేపీతో వెళతారనే ప్రచారమూ జరిగింది. కొద్ది రోజులుగా వేచి చూసే ధోరణిలో ఉన్నారని.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆయన దీనిపై త్వరలోనే స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు టచ్ లో ఉన్నారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి సైతం ఇక్కడ నుంచి పలువురు నేతలు వెళ్లారని క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్లగొండ నియోజకవర్గానికి చెందిన దాదాపు రెండు దశాబ్దాల పాటు గులాబీ పార్టీలో కొనసాగి.. పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన చకిలం అనిల్ కుమార్ సైతం గులాబీ పార్టీకి రాజీనామా చేసి.. ఎన్నికల ముందు ఏ పార్టీలో చేరాలి అనే దానిపై సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన మరోసారి పొంగులేటితో ఖమ్మంలో సమావేశ మైనట్లు సమాచారం. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరిష్కరించుకోవాలని చూస్తున్నారట చకిలం అనిల్ కుమార్.

తాజాగా.. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెలిమనేడు హనుమాన్ టెంపుల్ దగ్గర పొంగులేటికి.. స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకడం.. జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. హనుమాన్ జయంతి సందర్భంగా.. వెలిమనేడు హనుమాన్ టెంపుల్ లో.. ప్రత్యేక పూజలు చేశారు పొంగులేటి. ఈ క్రమంలో ఓ ముఖ్య నాయకుడికి చెందిన బీఆర్ఎస్ అనుచరులు పొంగులేటికి స్వాగతం పలకడంతో.. చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి బహిష్కరించబడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నాయకులు.. కొత్త పార్టీ పెడతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న పొంగులేటి.. తనతో కలిసి వచ్చే ఇతర జిల్లాలకు చెందిన నాయకులకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. మరికొద్దిరోజుల్లో.. అధికార గులాబీ పార్టీలోనూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోనూ.. టికెట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు వస్తే.. ముగ్గురు నుంచి నలుగురు బీఆర్‌ఎస్ నాయకులు పొంగులేటితో కలిసి నడిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వీరేగాక.. కాంగ్రెస్ పార్టీలోనూ ఇద్దరు నియోజకవర్గ నాయకులుసైతం.. ఈసారి టికెట్ దక్కకుంటే పొంగులేటి వెంట నడిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి పోరు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా నేతలు సిటింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకవేళ సీఎం కేసీఆర్ అన్నట్టుగా పూర్తిగా సిట్టింగులకి సీట్లు కేటాయిస్తే.. తమ భవిష్యత్తు ఏంటని సదరు నాయకులు మధన పడుతున్నట్లు నియోజవర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సేఫ్ సైడ్‌గా ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి ఆర్థిక రాజకీయ అండదండలు సైతం వీరికి ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో బీఆర్ఎస్‌ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి తన వర్గాన్ని ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకునేందుకు చాకచక్యంగా పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read MoreRead Less
Next Story