Editorial: కామ్రేడ్ల ఆశలపై నీళ్లు జల్లిన కేటీఆర్

Editorial: కామ్రేడ్ల ఆశలపై నీళ్లు జల్లిన కేటీఆర్


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ వామపక్షాల మధ్య పొత్తు ఉంటుందని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి. హుస్నాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి లక్ష మెజార్టీతో గెలిపించాలని క్యాడర్ కు మంత్రి కేటీఆర్ విస్పష్ట సంకేతాలివ్వడంతో హుస్నాబాద్ నియోజక వర్గంలో కామ్రేడ్లు డైలమాలో పడినట్లు టాక్ వినిపిస్తోంది.

కామ్రేడ్లతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కామ్రేడ్లకు బలమున్న నియోజకవర్గాల్లో హుస్నాబాద్ ఒకటి. అయితే పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి సీపీఐ పోటీ చేయాలని భావిస్తోంది. హుస్నాబాద్ లో సీపీఐ పార్టీ నుంచి దేశిని చినమలయ్య నాలుగు సార్లు విజయం సాధించారు. చాడ వెంకటరెడ్డి ఒకసారి విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ తో చేతులు కలిపితే ఈ సారి హుస్నాబాద్ లో గెలవచ్చని సీపీఐ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలానికి చెందిన చాడ వెంకట్ రెడ్డి 2004లో ఇందుర్తి నియోజకవర్గం నుండి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో పొత్తులు ఉన్నప్పటికీ టిఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావు పై పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు చాడ వెంకట్ రెడ్డి. 2018లో మహాకూటమిలో భాగంగా సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి ఒడిత‌ల స‌తీష్ కుమార్ చేతిలో ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచారు. అయితే గతంలో ఇలా పలు పార్టీలతో పొత్తు పెట్టుకొని కూడా ఎన్నికల్లో పోటీ చేసారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే సతీష్ కుమార్‌నే టికెట్ వరించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. హుస్నాబాద్‌ ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. అయితే హుస్నాబాద్ నుంచి ఎన్నికల బరిలో ఉంటామని చాడ వెంకటరెడ్డి కరాఖండి చెప్పేశారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, నియోజకవర్గ స్థాయిలో సమస్యలపై పోరాటం ఆగదని చాడ వెంకటరెడ్డి గతంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి అనేదానిపై ఇప్పటి నుండే కొంత ఆసక్తి మొదలైంది. అయితే బీఆర్ఎస్ తో పొత్తు కుదిరితే సీపీఐ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఉవ్విళ్లూరుతున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆశలపై మంత్రి కేటీఆర్ నీళ్లు జల్లడంతో కామ్రేడ్లు డైలమాలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం.. రెండుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయం సాధించిన ఈ నియోజకవర్గాన్ని కేసీఆర్ సీపీఐకు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హుస్నాబాద్ సీటు విషయంలో బీఆర్ఎస్, సీపీఐ మధ్య పీటముడి పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య పొత్తులపై ప్రభావం చూపుతుందా ? అన్నది ఎన్నికల దాకా వేచిచూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story