గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు వర్సెస్ కార్పొరేటర్లు

గ్రేటర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు వర్సెస్ కార్పొరేటర్లు
గ్రేటర్ హైదరాబాద్‌ బీఆర్ఎస్‌లో వర్గపోరు రగులుతోందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు అసలు పొసగడం లేదా? కార్పొరేటర్ల భర్తలు టికెట్ రేసులో ఉండటమే వర్గపోరుకు కారణమా? గ్రేటర్‌ బీఆర్ఎస్‌లో అసలు ఏం జరుగుతోంది?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ లో వర్గ పోరు తారాస్థాయికి చేరినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాలలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్ల కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని క్యాడర్‌లో చర్చనడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా అందులో ఓల్డ్ సిటీలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే లు ఉన్నారు. బీజేపీ ఒక్క గోషామహల్ నియోజకవర్గం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 16 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారం లోకి రావాలంటే గ్రేటర్‌లో గతంలో గెలిచిన స్థానాల్లో మళ్ళీ గెలవాలి.కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో ఒక వైపు బీజేపీ దూకుడు తట్టుకోవడం అలా ఉంచితే....... సొంత పార్టీ కి చెందిన BRS కార్పొరేటర్లకు, వారి భర్తల తోనే టికెట్ పోటీ నెలకొందని చర్చ నడుస్తోంది.

ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉప్పల్ ఎమ్మెల్యే రేసులో బొంతు శ్రీదేవి భర్త...మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉండడం, నియోజకవర్గంలో బొంతు రామ్మోహన్ వివిధ కార్యక్రమాలతో హల్‌చల్ చేస్తుండడంతో ....బొంతు శ్రీదేవికి, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పడడం లేదని సమాచారం. ఇటీవల తనను కులం పేరుతో దూషించి, చంపేందుకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ప్రయత్నించారని, బొంతు శ్రీదేవి బహిరంగంగా ఆరోపిస్తూ కంట తడి పెట్టడం అప్పట్లో ఉప్పల్ బీఆర్ఎస్ లో కలకలం రేపింది.

అంబర్ పేట లోఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు గోల్నాక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ కు మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరినట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్ ... నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగంగా విమర్శలు చేసుకోవడం అంబర్ పేట లో బీఆర్ఎస్ వర్గ పోరుకు అద్దం పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గోల్నాక కార్పొరేటర్ భర్త తన ఎమ్మెల్యే సీటు కు ఎసరు పెడతారనే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , కార్పొరేటర్ భర్త కు విభేదాలు వచ్చాయని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వెంకటేశ్వర నగర్ కార్పొరేటర్ మన్నే కవిత భర్త మన్నే గోవర్ధన్ రెడ్డికి అసలు పడడం లేదు. 2014 లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి పాలైన మన్నే గోవర్ధన్ రెడ్డి ....వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతానని తన ఆసరా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ...నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆపార్టీ ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు , వారి భర్త లకు పొసగడంలేదన్నది బహిరంగ రహస్యం. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నా...తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారోనన్న భయంతో ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు సమాచారం.

మొత్తం మీద బీఆర్ఎస్ మళ్ళీ అధికారం లోకి రావాలంటే ....గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు నిలబెట్టుకోవాలి.ఒక వైపు బీజేపీ దూకుడు కు అడ్డుకట్ట వేయడం తో పాటు బీఆర్ఎస్ లో జరుగుతున్న వర్గ పోరు కు చెక్ పెట్టాలని క్యాడర్‌లో చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story