నెల్లూరు వైసీపీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్

నెల్లూరు వైసీపీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్
ముఖ్యమంత్రి పర్యటన నెల్లూరు నగరంలో అగ్గిరాజేసిందా? బాబాయ్ అబ్బాయ్ మద్య చిచ్చు మళ్లీ రాజుకుందా.? మాజిమంత్రి అనీల్ కుమార్ యాదవ్.. నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోందా?

నెల్లూరు నగర వైసీపీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది. చీకటి పడితే రూప్ కుమార్ వర్గం హడలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇళ్ల నుండి బయటకు రావాలంటే బెదిరిపోతున్నారట. ఎటువైపు నుండి ఎవరు దాడి చేస్తారోనని ఆందోళన చెందుతున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. రూప్ కుమార్ యాదవ్ వర్గీయుల పై చీకటి పడితే దాడులకు తెగబడుతున్నారట. కార్పోరేటర్లు, నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారంటూ డిప్యూటి మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆరోపిస్తున్నారు. ఒకటి తరువాత ఒకటిగా జరుగుతున్న వరుస సంఘటనలు.. అందులోనూ రూప్ కుమార్ యాదవ్ అనుచరుల పైనే జరుగుతుండటం చూస్తుంటే రూప్ కుమార్ యాదవ్ ఆరోపణల్లో వాస్తవముందా అని నెల్లూరు వాసులు చర్చించుకుంటున్నట్లు టాక్. మరోమారు రూప్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరుడు షేక్ హాజి తనపై అనిల్ వర్గీయులు దాడి చేశారంటూ చేసిన సంచలన ఆరోపణలతో రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. మా జోలికొస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని రూప్ కుమార్ యాదవ్ హెచ్చరించాడంతో వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు మరోమారు బహిర్గతమయింది. నేను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదంటూ రూప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

చెప్పు తినే కుక్కకు చెరుకు తీపేమి తెలుసు విశ్వదాభిరామ పద్యాన్ని రూప్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేకు అన్వయిస్లూ తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు. పగలనక, రాత్రనక శ్రమించి అందలం ఎక్కించిన కార్యకర్తలపైనే దాడులు చేయిస్తావా అంటు రూప్ కుమార్ చేసిన సంచలన ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే అనిల్ సైతం రూప్ కుమార్ యాదవ్ విమర్శలకు ధీటుగా బుదులిచ్చారు. ఎక్కడ ఏం జరిగిన తన పై రుద్దడం సరికాదని.. వ్యక్తిగత వివాదాలను తనకు ఆపాదిస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేస్తే నేను నీ బండారం బయట పెడతానని అన్నారు. ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చిన విషయం బయట పెట్టి నిన్ను బజాకీడ్చగలనని మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ దీటుగా బదులిచ్చారు.

రెండేళ్లుగా బాబాయ్ అబ్బాయ్ ల మధ్య రగులుతున్న వివాదం ఏనాటికైన సమసిపోతుందిలే అనుకున్న వారికి తాజా పరిణామాలతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జిల్లా పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి ..చొరవ తీసుకొని మాజీమంత్రి అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ల చేతులను కలిపి ఇద్దరు కలిసి పనిచేయాలని కోరారు. ఇది జరిగిన వారం రోజుల్లోనే మళ్లీ విభేదాలు రచ్చకెక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి చేతులు కలిపినా.. మనస్సులు కలవలేదని పార్టీ క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. రెండు దశాబ్డాల కాలంగా కలసి మెలసి ఉంటూ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితానికి తోడుగా బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ నిలిచాడన్న విషయం జిల్లా వాసులకు తెలిసిన బహిరంగ రహస్యం.

అయితె రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ కలసిమెలసి ఉన్నంత కాలం తమ పాచికలు పారవని ఇద్దరి మధ్య విభేదాలకు అనిల్ మంత్రిగా ఉన్న సమయంలో కొందరు చక్రం తిప్పారని జిల్లాలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా సమస్య మరింత జఠిలమయిందని టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story