శృంగవరపు కోట వైసీపీ వర్గపోరుపై టీవీ 5 ఎఫెక్ట్‌

శృంగవరపు కోట వైసీపీ వర్గపోరుపై టీవీ 5 ఎఫెక్ట్‌
శృంగవరపుకోట వైసీపీ వర్గపోరు పై టీవీ-5 ప్రసారం చేసిన వరుస కథనాలు నిజమయ్యయా? పార్టీలో అసమ్మతిపై టీవీ 5 కథనాలు వాస్తవమేనని ఎమ్మెల్యే కడుబండి వర్గీయులు జగన్‌కు చెప్పారా? ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఐ ప్యాక్ టీమ్ సర్వేలో కూడా అదే రిజల్ట్ రావడంతో జగన్ టీవీ 5 కథనాలను సమర్థించారా? అందుకే భోగాపురం పర్యటనలో వర్గపోరుపై వైసీపీ ఎమ్మెల్సీకి జగన్ క్లాస్ తీసుకున్నారా?


విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ వైసీపీలో గత కొంత కాలంగా నడుస్తున్న వర్గపోరుపై టీవీ 5 కథనాలు ప్రసారం చేసింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుల మధ్య నెలకొన్న విభేదాలపై పూర్తి సమాచారాన్ని సేకరించిన టీవీ-5 వర్గపోరుపై పక్కలో బల్లెం అంటూ కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో వర్గపోరుకు కారకులైనటువంటి ఎమ్మెల్సీ రఘురాజుపై ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అప్పట్లో వైసీపీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్సీ మంత్రి బొత్స, జెడ్పీ చిన్న శ్రీనులకు ప్రధాన అనుచరుడు కావడంతో ఆ వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడలేదు. దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను, ఎమ్మెల్సీ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే కడుబండి నేరుగా జగనకే ఫిర్యాదు చేశారట. దీంతో తాను చూసుకుంటానని జగన్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారు.


ఈ పరిణామాల నేపథ్యంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన, బహిరంగ సభ అనంతరం జిల్లా నాయకులతో సమావేశం అయ్యారట. ఆ సమయంలో ఎమ్మెల్సీ రఘురాజుపై.. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వర్గం మరోమారు ఫిర్యాదు చేశారట. దీనికి ఆధారాలు చూపుతూ వర్గపోరు పై టీవీ-5 లో ప్రసారమైన కథనాలను చూపించారట. అయితే అప్పటికే తన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు, ఐ ప్యాక్ టీమ్ సర్వే రిపోర్టులను టీవీ 5 కధనాలతో పోల్చుకున్న సీఎం ...టీవీ 5 కథనాలు వాస్తవమేని నమ్మడంతో వర్గపోరుకు కారకుడైన ఎమ్మెల్సీ రఘురాజుపై సీరియస్ అయ్యారట. తీరు మార్చుకోవాలని హెచ్చరించారట. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావే బరిలో దిగుతారని కూడా శ్రేణులకు సంకేతాలు ఇచ్చారట జగన్.

అనంతరం సమావేశం ముగించుకుని వెళ్తుండగా ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రఘురాజు, ఆయన భార్య సుబ్బలక్ష్మిలపై మరోమారు మండిపడ్డారట. అన్నా... నీకేం అన్యాయం చేశాను. సామాజిక సమీకరణాల్లో ...పదవికి అవకాశం లేకున్నా అందలం ఎక్కించడం నేను చేసిన నేరమా? అంటూ సీఎం సూటిగా ప్రశ్నించారట. జిల్లాలో రాజుల సామాజిక వర్గం నుండి పెనుమత్స సురేష్ బాబు ఎమ్మెల్సీగా ఉన్నా ... నీకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాను కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారట. దీనికి తోడు భార్య, భర్తలను ఇద్దరిని కంట్రోల్ చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడుకి సైతం ఆదేశాలిచ్చారట.

అయితే సాక్షాత్తూ పార్టీ అధినేత క్లాస్ తీసుకున్నా ఎమ్మెల్సీ వ్యవహార శైలి మారలేదని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. వేపాడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌కు ముందుగా ఎమ్మెల్సీ హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే వచ్చే సమయానికి అక్కడ నుండి వెళ్లిపోయారు. కొత్తవలస మండలం చీడివలస గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్సీ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి జిల్లాలో ఏ కార్యక్రమానికైనా హాజరయ్యే ఎమ్మెల్సీ జగన్ హెచ్చరించిన తరువాత కూడా ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అధినేత వద్ద తన ఇమేజ్ డామేజ్ చేశారని ఎమ్మెల్సీ రఘురాజు ఆగ్రహంతో ఉన్నారని అందుకే ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలలో పాల్గొనడంలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story