నెల్లూరు కార్పొరేషన్‌లో డిష్యుం డిష్యుం

నెల్లూరు కార్పొరేషన్‌లో డిష్యుం డిష్యుం
నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ కార్పొరేటర్లు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారా? కౌన్సిల్ సభ్యులందరూ అధికార వైసీపీ వారే

నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ కార్పొరేటర్లు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారా? కౌన్సిల్ సభ్యులందరూ అధికార వైసీపీ వారే అయినప్పటికీ స్వపక్షంలో విపక్షంలా మారారా? మహిళ అని కూడా చూడకుండా మేయర్ స్రవంతిపై దాడిచేయడానికి కారణమేంటి?

నెల్లూరు కార్పొరేషన్‌లో కౌన్సిల్ సభ్యుల ఘర్షణతో అధికార పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ బహిష్కరించడంతో దాని ప్రభావం కార్పొరేషన్‌పై పడింది. దీంతో కార్పొరేషన్‌లో కౌన్సిల్ సభ్యులు నాలుగు గ్రూపులుగా విడిపోవడంతో సభ రసాభాసగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరానికి చెందిన అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష తెలుగుదేశం అభ్యర్థులను బెదిరించి పోటీ నుండి తప్పించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఓటర్లను జాబితా నుండి తొలగించి...అరాచకాలు, విధ్వంసకాండ సాగించడం ద్వారా కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నిక తరువాత జరిగిన ఒకే ఒక సమావేశంలో 54 మంది కార్పొరేటర్ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నారు. రట. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో నెల్లూరు నగరంలో బాబాయ్ అబ్బాయ్ విడిపోవడం.. నెల్లూరు నగరంలోని 28 మంది కార్పొరేటర్లలో అబ్బాయ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వర్గంగా.. బాబాయ్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వర్గంగా రెండుగా చీలిపోయారు.

ఈ పరిణామాల అనంతరం జరిగిన కౌన్సిల్ సమావేశంలో అనిల్ వర్గం కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ మధ్య జరిగిన దాడులు జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎనిమిది నెలల తరువాత జరిగిన బడ్జెట్ సమావేశంలో కొత్తగా మరో రెండు గ్రూపులు తెరమీదకు రావడంతో బడ్జెట్ సమావేశం రసాభాసగా మారిందనే ప్రచారం జరుగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీపై తిరుగుబాటు చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిష్కరణకు గురవడంతో రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్ల కార్పొరేటర్లలో పది మంది శ్రీధర్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. దీంతో మిగిలిన 16 మంది కార్పొరేటర్లు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జిగా వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంట నడిచారు. కార్పొరేషన్ లో ఆదాల, అనిల్ కుమార్, రూప్ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రూపులుగా 54 మంది కార్పొరేటర్లు విడిపోయి రాజకీయం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌లో అభివృద్ధికి కీలకమైన బడ్జెట్ చర్చను పక్కదారి పట్టించి మేయర్ స్రవంతి పై ముప్పేట దాడికి దిగారని ప్రచారం జరుగుతోంది.

ఉదయం పదిన్నరకు ప్రారంభమైన బడ్జెట్ సమావేశం దాదాపు గంటన్నరపాటు సర్వసభ్య సమావేశం జరిపే తేదీ కోసం కౌన్సిల్‌లోని ఆదాల వర్గం సభ్యులు పట్టుబట్టడంతో సమస్య మరింత జఠిలమయింది . మేయర్ స్రవంతి వారిస్తూ పదిహేను రోజుల్లో జరుపుకుందామని చెపుతున్నా మేయర్ మాటను పెడచెవిన పెట్టి నినాదాలతో హోరెత్తించి కౌన్సిల్ హాల్లో భయానక వాతావరణ సృష్టించారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైసీపీతో విభేదిస్తున్నట్టు ప్రకటించారు కాబట్టి మేయర్ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ నినాదాలు చేయడం సభలో కాక రేపింది. అయితే.. సభలో కొందరు కార్పొరేటర్లు మేయర్ కు పరోక్షంగా అండగా నిలబడ్డారు. మేయర్ పై ముప్పేట దాడి జరుగుతున్న సందర్భాల్లో సీనియర్ కార్పొరేటర్ పైకి లేచి మేయర్‌కు పరోక్షంగా మద్దతు తెలపడంతో విమర్శలు చేస్తున్న ఆదాల వర్గం కార్పొరేటర్లు బైఠాయించారు.

మొత్తానికి గ్రూపులుగా విడిపోయిన సభ్యులు నెల్లూరు కార్పోరేషన్ సమావేశాన్ని రసాభాస చేశారు తప్ప.. నెల్లూరు నగరంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించలేదని నగర ప్రజలు కార్పోరేటర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story