రాజకీయ రంగు పులుముకున్న పెంచలకోన

రాజకీయ రంగు పులుముకున్న పెంచలకోన
నెల్లూరు జిల్లా పెంచలకొనలో పెనుశిలా లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వివాదస్పదంగా మారాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు వైసీపి బ్రహ్మోత్సవాలుగా మారాయా? స్థానిక ఎమ్మెల్యే ఆనం మూడేళ్లు వైభవోపేతంగా జరిపిన ఉత్సవాలు ఇపుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయా? ఆలయ ఛైర్మన్ ఉన్నప్పటికీ పాత ఛైర్మన్ కీలకంగా వ్యవహరిస్తున్నారా? వెంకటగిరి ఎమ్మెల్యే, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్ కు సంబంధం లేకుండా ఏడు రోజుల బ్రహ్మోత్సవాల నిర్వహణ ఎలా సాధ్యం?


నెల్లూరు జిల్లా పెంచలకొనలో పెనుశిలా లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వివాదస్పదంగా మారాయి. మే 01 నుంచి 7తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు నుండి కూడా దాదాపు 5 నుండి 10 లక్షలు వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న పెనుశిలా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఏడు రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు వివాద స్పదంగా మారాయని జోరుగా చర్చ సాగుతోంది. గత మూడు ధపాలు జరిగిన ఉత్సవాలను పాలక మండలి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైభవోపేతంగా నిర్వహించారని ప్రజలు చర్చించుకుంటున్నారట. అయితే అందుకు బిన్నంగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఉత్సవాలను నిర్వహించడం పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయట. అందులోనూ పాలక మండలి ఆలయ చైర్మన్ గా ఉన్న చెన్ను తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాల్సిన బ్రహ్మోత్సవాలను సొంత నిర్ణయాలతో రాంకుమార్ రెడ్డి నిర్వహిస్తుండటం పై నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కనీసం సూచనలు, సలహాలు కూడా తీసుకోకుండా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం కాని జిల్లా స్థాయి అధికారుల సమీక్షలో కనీస ఆహ్వానం కూడా లేకుండా చేయడంపై భక్తులు ప్రశ్నిస్తున్నారు.

అయితే దీనికి పలు కారణాలను వైసీపీ నేతలు ఎత్తి చూపుతున్నారట. స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడుగా వ్యవహరించిన దివంగత రాపూరు జడ్పీటీసి చెన్నూ బాల కృష్ణ రెడ్డికి నరసింహస్వామి ఆలయ ఛైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి స్వయానా తమ్ముడు కావడంతోనే ఆయనకు ప్రాధన్యత ఇవ్వడం లేదని జిల్లాలో చర్చ జరుగుతోంది. అయితే ప్రసిద్ది గాంచిన దైవిక కార్యక్రమంలో రాజకీయాలేంటని పలువురు వైసీపి నాయకులే పెదవి విరుస్తున్నారట. గతంలో పనిచేసిన మాజీ ఛైర్మన్ రవీంద్రా రెడ్డి ఆలయ ఛైర్మన్‌లా అన్నింటిలో ముందుంటూ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. అయితే ఆలయ అధికారులు కూడా ప్రోటోకాల్ కూడా పాటించటలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయట. మాజీమంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పై కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదట. బ్రహ్మోత్సవాల పిలుపు కోసం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, రాంకుమార్ రెడ్డి గాడ్ ఫాదర్ సజ్జల రామకృష్ణా రెడ్డిని, జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నాయకులకు ఆహ్వానం పలికేందుకు మాజీ ఛైర్మన్‌ని, ఈఓని వెంటపెట్టుకు వెళ్లినట్లు సమాచారం.

పార్టీకి దూరంగా ఉన్నప్పటికి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేనన్న కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఆరుమండలాల్లో పరిస్థితి ఒకలా ఉంటే రాపూరులో మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయట. దివంగత నేత చెన్ను బాలకృష్ణారెడ్డి వర్గం అధికార పార్టీలో కొనసాగుతున్నా నేదురుమల్లి వెంట మాత్రం నడవటంలేదట. తన వద్దకే రావాలని నేదురుమల్లి... ఆనం వెంటే ఉంటామని చెన్ను వర్గీయులు పట్టుబడుతుండటంతో బ్రహ్మోత్సవాలు రాజకీయ బలప్రదర్శనకు వేదికగా మారాయన్న టాక్ వినిపిస్తోంది. దీంతో లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైసీపీ సమన్వయకర్త వర్సెస్ ఆలయ ఛైర్మన్‌గా వ్యవహారం నడుస్తోందట. దీంతో పెంచలకోన ఆలయం వేదికగా వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు. ఏడు రోజుల పాటు జరగనున్న నరసింహుడి బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు వేదికగా మార్చారా? అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story