ఉప్పల్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట?
ఉప్పల్ కాంగ్రెస్ లో మూడు ముక్కలాట కొనసాగుతుందా? ఉప్పల్ నుండి కాంగ్రెస్ బరిలో దిగేందుకు ఆ ముగ్గురూ పోటీ పడుతున్నారా? ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారా? నిత్యం ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ లో వేడి రాజేస్తున్న ఆ ముగ్గురు నేతలు ఎవరు?
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో కోలాహలం మొదలయింది. ప్రధాన పార్టీలలో టికెట్ ఫైట్ తో నేతలు కాకపుట్టిస్తున్నారు. ఎవరికివారు టికెట్ నాదంటే నాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు పలుకుబడి ఉన్న నేతల దగ్గర పైరవీలు చేస్తూ టికెట్ దక్కించుకునే పనిలో నేతలు బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారట. 2020 లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉప్పల్ డివిజన్ నుంచి రజిత పరమేశ్వర్ రెడ్డి , A. S. రావు నగర్ నుంచి శిరీష సోమశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి విజయంలో ఉప్పల్ నియోజకవర్గం కీలక పాత్ర పోషించింది. 2009లో కాంగ్రెస్ నుంచి బండారు రాజిరెడ్డి, 2014లో టీడీపీ మద్దతు తో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, 2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భేతి సుభాష్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ సారి ఉప్పల్‌లో ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందో నని అందరిలో ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉప్పల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. దీంతో ఉప్పల్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
1997 నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి 2009 లోనే ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ ఆశించారట. బండారు రాజిరెడ్డికి టికెట్ దక్కడంతో ఆయన గెలుపు కు కోసం కృషి చేశారు. 2014 లో కాంగ్రెస్ పార్టీ బండారు లక్ష్మారెడ్డికి కి టికెట్ ఇవ్వడం తో అప్పుడు కూడా పార్టీ విజయం కోసం పని చేశారు. 2018 లో మహా కూటమి పొత్తులో భాగంగా ఉప్పల్ టికెట్ టీడీపీ వెళ్ళింది.అయినా పార్టీ పెద్దలు నచ్చ చెప్పడంతో టీడీపీ కోసం పని చేశారు రాగిడి లక్ష్మా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ...మరో వైపు మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల్ లో విద్యా, వైద్యం అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాగిడి లక్ష్మారెడ్డి అనునిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఈ సారి ఉప్పల్ టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు రాగిడి లక్ష్మారెడ్డి.
ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్న సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కుటుంబానికి ఉప్పల్ నియోజకవర్గ రాజకీయల్లో విడదీయ రాని అనుబంధం ఉంది. సింగిరెడ్డి కుటుంబం నుంచే అప్పట్లో కాప్రా సర్పంచ్ గా పనిచేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ అయిన కాప్రా లో కౌన్సిలర్‌గా సింగిరెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారు. ప్రస్తుతం GHMC A. S. రావు నగర్ డివిజన్ కార్పొరేటర్‌గా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి భార్య శిరీష కొనసాగుతున్నారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ....ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ మల్కాజ్ గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. యువ సేన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు సోమశేఖర్ రెడ్డి. ఉప్పల్ నియోజకవర్గంలో పేద ప్రజలకు హార్ట్ ఆపరేషన్లు, విద్యార్థుల కోసం సహాయం చేయడం తో పాటు కరోనా టైమ్ లో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఫ్రీ అంబులెన్స్ సర్వీసు ఏర్పాటు చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో యాత్ర తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకు గా పాల్గొంటూ ఉప్పల్ నియోజకవర్గంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి కి ప్రధాన అనుచరుడిగా ఉండటంతో ఈ సారి తనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని సోమశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్ ఏ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్న మందుముల పరమేశ్వర రెడ్డి 2009 లో ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించారు. 2014 లో ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికి మహా కూటమి పొత్తులో భాగంగా టీడీపీకి టికెట్ దక్కింది. 2020 లో జరిగిన GHMC ఎన్నికల్లో ఉప్పల్ కార్పొరేటర్ గా పరమేశ్వర రెడ్డి భార్య రజిత విజయం సాధించారు. కరోనా సమయంలో పేదలకు నిత్యవసర వస్తువుల ను పంపిణీ చేసిన పరమేశ్వర రెడ్డి సేవా కార్యక్రమాలతో అనునిత్యం ప్రజల్లో ఉంటున్నారు. రేవంత్ రెడ్డి కి ప్రధాన అనుచరుడిగా ఉన్న పరమేశ్వర రెడ్డి ఈ సారి ఉప్పల్ కాంగ్రెస్ టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com