అంబర్ పేట కారులో కల్లోలం

అంబర్ పేట కారులో కల్లోలం


అంబర్ పేట నియోజకవర్గ బీఆర్ఎస్‌లో అసమ్మతి రచ్చకెక్కిందా? ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ఏకమయ్యారా ? అంబర్ పేట BRS లో వర్గ పోరు తారస్థాయికి చేరిందా ? నియోజకవర్గ బీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా? అసలు అంబర్ పేట BRS లో ఏమి జరుగుతుంది?

ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్‌లో వర్గపోరు రచ్చకెక్కుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో అసమ్మతి గళం వినిపిస్తోంది. అంబర్ పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లలో గోల్నాక కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్ కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోదని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని....గోల్నాక కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ ...నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ ను బహిరంగంగానే నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించడం ఇప్పుడు అంబర్ పేటలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రతిగా నువ్వు ఏమీ చేయలేవంటూ శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే కాలేరు పై విరుచుకుపడడం అంబర్ పేట లో బీఆర్ఎస్ వర్గ పోరు తారాస్థాయికి చేరిందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

2009 లో ఏర్పాటు అయిన అంబర్ పేట నియోజకవర్గం బీజేపీ కి కంచుకోటగా ఉండేది. అంబర్ పేటలో కిషన్ రెడ్డి ....టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా 2009 , 2014లో రెండు సార్లు MLA గా విజయం సాదించారు. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కిషన్ రెడ్డి పై BRS నుంచి పోటీ చేసిన కాలేరు వెంకటేష్ గెలిచారు. అయితే 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అంబర్ పేట నియోజకవర్గంలో ఉన్న 5 డివిజన్ల లో మూడు బీజేపీ , రెండు బీఆర్ఎస్ కార్పొరేటర్లు విజయం సాధించారు. తమకు టికెట్ రాకుండా చేయడంతో పాటు టికెట్ వచ్చిన వారిని కాలేరు వెంకటేష్ ఓడించారని బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

మరో వైపు గతంలో కాచిగూడ కార్పొరేటర్ గా పని చేసిన ఎక్కాల కన్నా అంబర్ పేట బీఆర్ఎస్ టికెట్ నాకేనంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలు తనకు కలిసి వస్తాయని ఎక్కాల కన్నా టికెట్ పై ధీమాతో ఉన్నట్లు సమాచారం. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండే కాచిగూడ లో 2016 లో BRS కార్పొరేటర్ గా పని చేసిన ఎక్కాల కన్నా.... ఇతర రాష్ట్రల్లో BRS పార్టీ విస్తరణ లో భాగంగా కేసీఆర్ వెళ్ళే మీటింగ్ లకు వెళ్లుతున్నారు. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతున్న ఎక్కాల కన్నా అంబర్ పేట టికెట్ తనకే దక్కుతుందని అని గంపెడు ఆశతో ఉన్నారు. కార్పొరేటర్‌గా లేకున్నా కరోనా సమయంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. అంబర్ పేట నియోజకవర్గంలో మాజీ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ , BRS మాజీ ఇంఛార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి , గోల్నాక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ , మాజీ కార్పొరేటర్లు ఎక్కాల కన్నా , DP పద్మా , గరిగంటి శ్రీదేవి , తెలంగాణ ఉద్యమకారులు ...MLA కాలేరు వెంకటేష్ కు వ్యతిరేకం జట్టు కట్టినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. తమలో ఎవరికైనా అంబర్ పేట టికెట్ ఇవ్వండి ...కానీ కాలేరు వెంకటేష్ కు మాత్రం ఇవ్వవద్దని వారంతా అధిష్ఠానాన్ని కోరుతున్నారట. అయితే ఎవరెన్ని గ్రూపుల కట్టినా అంబర్ పేట BRS టికెట్ మళ్ళీ నాకే నంటున్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.

అంబర్ పేట నియోజకవర్గంలో BRS ఆత్మీయ సమ్మేళనాలు జరిగిన ప్రస్తుత కార్పొరేటర్ల కు , మాజీ కార్పొరేటర్ల కు , ఉద్యమకారులకు ఆహ్వానం అందకపోవడంతో గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఒక వర్గం , ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరో వర్గం వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ లేని విధంగా అంబర్ పేట బీఆర్ఎస్ వర్గ పోరు తారాస్థాయికి చేరడంతో అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి

Read MoreRead Less
Next Story